
ఎరువుల కోసం క్యూలో నిలబడి రైతు చనిపోయిన సంఘటనపై పీసిసి చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నదాత చనిపోయిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేయకుండా.. సినిమా టిక్కెట్ల కోసం లైన్ లో నిలబడి చనిపోతే సినిమా వాళ్లది తప్పా అంటూ నీరంజన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చాలా రోజులుగా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. రైతులకు సకాలంలో ఎరువులు అందిచాల్సిన కేసీఆర్ సర్కార్.. ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు.
సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో ఎరువుల కోసం క్యూలో నిలబడి చనిపోవడం సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్యానించారు. నీరంజన్ రెడ్డితో పాటు ప్రభుత్వం తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.