
విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి మారుతుందంటూ ఇప్సుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధానిపై మరింత గందరగోళానికి కారణమయ్యాయి. రాజధాని అమరావతిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు బొత్స. టీడీపీ హయాంలో అమరావతి శంకుస్థాపన జరగడంతో ఆ ప్రాంతంలో చాలా మంది భూములను కొనుగోలు చేశారు. ఎన్ఆర్ఐలు కూడ అక్కడ భూములు కొన్నారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం ప్రారంభం కావడంతో రియల్ వ్యాపారం కూడ జోరందుకొంది. గతంలో ఎకరం భూమి ధర 2 కోట్లు పలుకగా .. ప్రస్తుతం ఎకరం 45లక్షలకు పడిపోయినట్టుగా రియల్టర్లు చెబుతున్నారు.
రాజధాని మార్చాలనే వైసీపీ సర్కార్ ఆలోచనను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ దుర్మార్గంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనేది బాబు వాదన. ముంపు ప్రాంతంగా అమరావతికి ముద్రవేసి రాజధానిని వేరే చోటకు షిఫ్ట్ చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా కనిలిస్తోందనే రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరదలను భూతద్దంలో చూపించి రాజధాని నిర్మాణం ఆపాలనుకుంటే ఎంతవరకు సమంజసం.వరద ప్రభావానికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఉన్న ప్రాంతాలేవీ మునగలేదుకదా అనేది ఏపీ లో సామాన్య ప్రజలు వాదన. యమునకు వరద వస్తే ఢిల్లీని తరలిస్తారా .. ఒకవేళ చెన్పై మునిగితే అక్కడ కూడా రాజధానిని మార్చేస్తారా అనే సగటు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.రాజధాని విషయంలో తప్పుడు ఆలోచనలతో ప్రజలను అయోమయానికి గురిచేయడం ఎంతవరకు సమంజసం. అయితే సీఎం వైయస్ జగన్ మనుషులు భూములు కొన్నందున రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకి మార్చాలనుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే రాజధాని మార్పు విషయంలో వైసీపీ లోని కొందరు నాయకులు చెబుతున్నది మరోలా ఉంది. వాస్తవానికి రాజధాని మార్పు జరగే అవకాశమే లేదని .. ఇప్పుడున్న 29 గ్రామాలకు బదులుగా ఐదు గ్రామాలను రాజధాని కోసం ఉంచి, మిగిలిన వాటిని రైతులకు తిరిగి ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. కోర్ క్యాపిటల్ 2250 ఎకరాల వరకూ ఉండవచ్చని అంటున్నారు. ఇందులో ఇది నిజమో తెలియక ప్రజలు అయోమయానికి గురౌతున్నారు.