News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

జైపాల్ రెడ్డి కన్ను మూశారు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన  ఈనెల  20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. జైపాల్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 77 సంవత్సరాల జైపాల్ రెడ్డి తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు.  ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్‌ రెడ్డి తల్లిదండ్రులు దుర్గారెడ్డి, యశోదమ్మ. మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో జైపాల్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో పట్టా పొందారు. జైపాల్‌రెడ్డి విద్యార్థి దశనుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. గతంలో కాంగ్రెస్‌ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆపార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. జైపాల్ రెడ్డి 1985 నుంచి 88 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓడిపోయారు.

jaipal reddy
మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1969లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎస్.జైపాల్‌రెడ్డి నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. 1990, 1996లో జైపాల్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జూన్‌ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా పనిచేశారు. ఆ తరువాత ఐకే గుజ్రాల్‌ మంత్రివర్గంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్‌సింగ్‌ క్యాబినెట్ లో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు.

jaipal reddy

- Advertisement -

జైపాల్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జైపాల్ రెడ్డి మరణ వార్త విని పీసిసి చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి జైపాల్ రెడ్డి చేసిన సేవలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. జైపాల్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఉత్తమ్ అన్నారు. అటు జైపాల్ రెడ్డి మృతి పట్ల సోనియా గాంధీ, రాహూల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జైపాల్ రెడ్డి మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Tags: jaipal reddy passed away, congress leader jaipal redd passed away, ex central minister jaipal reddy passed away, jaipal reddy died

Leave A Reply

Your email address will not be published.