
ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమాన్ని మరో వారం రోజుల పాటు కొనసాగిస్తున్నామని పీసిసి చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మునిసిపాలిటీ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ ను సమాయుత్తపరుస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య డూప్లికేట్ ఫైట్ నడుస్తోందని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని ఆయన మరోసారు తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలు మతతత్వాన్ని ప్రోత్సహించరని ఉత్తమ్ అన్నారు. పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన వాహనచట్ట సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వల్లే బీజేపీ సంఖ్యాబలం పెరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈమేరకు టీఆర్ఎస్, బీజేపీ పార్టీల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
మున్సిపాలిటీ అభివృద్ధి పవర్స్ కలెక్టర్లకు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే చట్టవ్యతిరేక పనులు చేస్తే కలెక్టర్ చర్యలు తీసుకోవడం వరకు తాము మద్ధతిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఫెయిల్ అయిందని.. 85శాతం చెట్లు బతకకపోతే సీఎం బాధ్యత వహిస్తారా అని సవాల్ విసిరారు. మరోవైపు టీఆర్ఎస్ను వీడిన మాజీ ఎంపీ జి వివేక్‌తో చర్చలు జరుపుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వేరే పార్టీకి మారతారో లేదో తనకు తెలియదని మీడియా అడిగిన ప్రశ్నికు ఉత్తమ్ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తామని కెప్టెన్ అన్నారు.