News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

పదవీ గండాలు

పదవీ కాలాలు ముగుస్తున్న వేళ పదవీ గండాలు.ఎవరిని వరిస్తాయో,ఎవరిని నిరాశను మోసుకొస్తాయో తెలియని అనిశ్చితి.మరోసారి అవకాశం అంటే మామూలు మాట కాదు.వచ్చే ఏడాది 2020లో రెండు రాజ్యసభ,మూడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి.అయితే వాటిలో ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ స్థానామే అందరిదృష్టి ఆకర్షిస్తోంది. రాజ్యసభ సభ్యుడు కేకే. ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి. ఈ ఇద్దరిలో మళ్లీ నాయినికి ఈసారి మెండిచేయి తప్పదన్న వార్తలే ఎక్కువ వినిపిస్తున్నాయి.

తెలంగాణ వాదాన్ని తొలినాళ్లనుంచి కేసిఆర్‌ కంటే ముందుగా భుజాన మోస్తున్న నాయకుడు నాయిని నర్సింహారెడ్డి. తెరాసలో కీలకభూమికే పోషించాడు. ఆయనకు భోలా మనిషిన్న పేరు కూడావుంది. ఆయన మనసులో ఏమీ వుంచుకోడు. తనకు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తాడు. తన మనసుకు కష్టం కలిగిందంటే ఊరుకోడు. ఎవరినీ వదలడు. డోంట్‌ కేర్‌ అనుకుంటాడు. ఎందుకంటే ఆయన ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాజకీయాల్లోకి రాలేదు. ఆయన డెబ్బైవ దశకంలో ఎమ్మెల్యే. ఆనాడు టైగర్‌ అన్న పేరు సార్థకంచేసుకున్నాడు. ఆ కాలంలోనే ఆయన అసెంబ్లీకి వస్తున్నాడంటేనే అందరికీ తెలిసిపోయేది. ఎలాగనుకుంటున్నారా…బుల్లెట్‌ మీద వచ్చే ఎకైక ఎమ్మెల్యే ఆరోజుల్లో ఆయన ఒక్కడే. అదీ నాయని ధైర్యం. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.ఆయన ఏదీ మనసులో దాచుకోడు. అది ప్రజలకు జరిగే అన్యాయమైనా, తనకు జరిగే అన్యాయమైనా. అయితే ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో నాయిని ఒకరు.

గతంలో 2004 ఎన్నికల సమయంలో కూడా తెరాస తరుపున పోటీ చేసి, కాంగ్రెస్‌, తెరాస పొత్తు ప్రభుత్వంలో కూడా కొంత కాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత ప్రభుత్వం నుంచి బైటకు రావడం, ఎన్నికలకు వెళ్లడం, తన పదవి కోల్పోవడం ఇలా తెలంగాణ ఉద్యమం కాలంలో పదవులే కాదు, త్యాగాలు కూడా చేశారు. తెలంగాణ వచ్చాక గెలిచిన తెరాస ప్రభుత్వంలో తొలి హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. గత ఎన్నికల ముందు కూడా ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోయినా, ఎమ్మెల్సీని చేసి, మంత్రిని చేస్తానన్న కేసిఆర్‌ మాట నిలబెట్టుకున్నారు. కాని ఈసారి మొత్తానికే మొండి చేయి చూపించారు. తనకు టిక్కెట్టు ఇవ్వకపోయినా, తన అల్లుడికి టిక్కెట్టు ఇస్తానని కేసిఆర్‌ మాట తప్పారని బహిరంగంగానే ఆరోణలు గుప్పించారు. తనకు మంత్రిగా మళ్లీ అవకాశం కల్పిస్తానని ఇవ్వలేదని తన అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -

గతంలో గులాబీ ఓనర్లమన్న మాట పాపులర్‌ అయిన సందర్భంలో తానూ ఓనర్‌నే అని ప్రకటించారు.ఇటీవల ఆర్టీసి యూనియన్ల నిర్వీర్యం విషయంలో కూడా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు.యూనియన్లు లేకపోతే, కార్మికులకు తీరని నష్టమన్నాడు.అంతేకాదు నక్కలైట్ల ప్రస్తావన తెచ్చి, ఒక్కసారి తన మాట తీరులో ఏమార్పులేదని నిరూపించారు. తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా పనిచేసిన నాయిని, ఇలాంటి ప్రకటనలపై పెద్దగా స్పందన లేకపోయినా, ఆయనపై కేసిఆర్‌ గుర్రుగానేవున్నట్లు ప్రచారం సాగుతోంది. అందువల్ల ఆయను ఈసారి ఎమ్మెల్సీ కూడా కష్టమే అంటున్నారు.ఇక రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుకు కూడా మళ్లీ రాజ్యసభ రిన్యువల్‌ అన్నది కష్టమే అంటున్నారు.తెరానలో వరుసగా రెండుసార్లు రాజ్యసభ పదవి పొందిన నాయకుడు కూడా కేకేనే. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షపదవి చేపట్టిన ఆయన తెలంగాణ కోసం కాంగ్రెస్‌లో అంత్యంత కీలకమైన నాయకుడిగా వుంటూ కూడా తెరాసలో చేరారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. కేసిఆర్‌కు చోదోడు వాదోడుగా వున్నారు. పార్టీలో కేసిఆర్‌తో సమామైన పదవిలో కొనసాగుతున్నారు.

అయితే గతంలోనే ఓసారి కేకే విషయంలో పొమ్మనలేక పొగ పెట్టినట్లు జరిగిందన్నది చాలా మందికి తెలుసు. కేకే భూవిదాం తెరమీదకు తెచ్చి, కేకేని మౌన మునిని చేశారు. అప్పటినుంచి కేకే పెద్దగా కనిపించడమేమానేశారు. అప్పుడప్పుడు కేసిఆర్‌తో కలిసి రాజకీయ సభల్లో పాల్గొనడం తప్ప,మరెక్కడా ఆయన కనిపించడం లేదు. పైగా వయసు కూడా మీద పడుతోంది. అయితే ఇటీవల ఆర్టీసి కార్మికుల విషయంలో కేకే ఓ అడుగు ముందుకేసి, చర్చల పేరుతో జరిగిన హైడ్రామా ఆయనకు మళ్లీ రాజ్యసభ రాకుండా చేసిందన్న మాటలు అప్పుడే వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన కేకేను పక్కన పెట్టాలన్న ఆలోచనతోనే సిఎం. కేసిఆర్‌ వున్నట్లు గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. మరి ఈ ఇద్దరిని దగ్గరకు తీసుకొని చేరదీస్తాడా లేదా,దూరం పెట్టి, పదవులు ఇతరులకు కట్టబెడతాడా అన్నది వేచిచూడాల్సిందే…

Leave A Reply

Your email address will not be published.