News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

యాత్ర సినిమా రివ్యూ

సినిమా పిల్లర్- దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా రివ్యూ మీ కోసం…….

సినిమా- యాత్ర

తారాగణం- మ‌మ్ముట్టి, జ‌గ‌ప‌తిబాబు, సుహాసిని, రావు ర‌మేష్‌, అశ్రిత‌, అన‌సూయ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌చిన్ ఖేడేక‌ర్‌ త‌దిత‌రులు

పాట‌లు- సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి

నిర్మాణం- శ‌శిదేవిరెడ్డి, విజ‌య్ చిల్లా

ద‌ర్శ‌క‌త్వం- మ‌హి వి.రాఘ‌వ్

పరిచయం……………..

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా 2003లో చేసిన పాద‌ యాత్ర రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎంతో ప్రాముఖ్యమైంది. వైఎస్ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డానికి, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి ఈ పాద‌యాత్ర ప్ర‌ధాన కారణమని చెప్పవచ్చు. ఇదిగో అప్పటి ఈ పాదయాత్ర నేపధ్యంలోనే యాత్ర‌ సినిమాను రూపొందించారు. ఇక యాత్ర సినిమాలో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగా మలయాళ సీనియర్ న‌టుడు మ‌మ్ముట్టి న‌టించారు. మరి ఇంకెందుకాలస్యం.. వైఎస్ బయోపిక్ యాత్ర సినిమా ఎలా ఉందో చూసేద్దామా……

yatra

- Advertisement -

యాత్ర కధ………….

- Advertisement -

యాత్ర కధ అందరికి తెలిసిందే అని చెప్పవచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర ఇతివృత్తం ప్రధానాంశంగానే యాత్ర సినిమాను రూపొంచించారు. 2003లో ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి (మమ్ముట్టి) చేసిన పాద‌యాత్ర, యాత్రలో భాబంగా ప్రజలతో మమేకమైన భావోద్వేగాలతో సాగే కధ ఇది. వైఎస్ పాద‌యాత్ర ఎలా ప్రారంభించారు.. ఆ ప్ర‌యాణంలో ప్ర‌జ‌ల క‌ష్టాల్ని ఎలా తెలుసుకున్నారు.. వాళ్ల‌కి వైఎస్ భ‌రోసా ఎలా కల్పించారు..  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్ర‌వేశపెట్టిన ఉచిత ‌విద్యుత్తు, ఆరోగ్య‌శ్రీ, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ త‌దిత‌ర పథకాలకు ఆయన పాదయాత్రలోనే ఎలా రూపలక్లన చేశారు.. అనే చాలా అంశాలను యాత్రలో చూపించారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ, ఢిల్లీలోని అధిష్టానాన్ని కాద‌ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా నిర్ణ‌యాలు తీసుకునేవారు.. వ‌్య‌క్తిగ‌తంగా ఆయ‌న పార్టీని ఎలా ప్రభావితం చేశారు.. ప‌్ర‌జ‌ల్లో తనదైన ఇమేజ్ ను ఎలా తెచ్చుకున్నార‌నే అంశాల్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. పాద‌యాత్ర ముగిశాక.. ఎన్నికల్లో గెలుపు తరువాత సీఎం గా ప్రమాణస్వీకారం చేయడంతో యాత్ర ముగుస్తుంది.

ఎలా ఉందో తెలుసా……………..

వైఎస్ అనగానే మనకు ఆయన ఎప్పుడూ చెప్పే మాటలే గుర్తుకు వస్తాయి. మాట తప్పని.. మడమ తిప్పని వ్యక్తినని ఆయన చెబుతూ ఉండే వారు. ఇదిగో ఇదే సిధ్దాంతంపై ఆయ‌న ఒకసారి మాట ఇచ్చాక, ఎట్టిపరిస్థితుల్లోను వెనక్కి తగ్గడనే తత్వాన్ని చూపిస్తూ, ఒక నాయ‌కుడిగా ప్ర‌జ‌లతో ఎలా మ‌మేక‌మ‌య్యారు.. త‌న‌యుడు ప‌్ర‌జానాయ‌కుడు కావాల‌ని త‌న తండ్రి రాజారెడ్డి క‌న్న క‌ల‌ని ఎలా నెరవేర్చారనే అంశాల్ని హైలైట్ చేస్తూ ఈ సినిమాని రూపొందించాడు డైరెక్టర్. సాధారనంగా బ‌యోపిక్ అంటే పుట్టు పూర్వోత్త‌రాలు మొద‌లుకొని చివరి వరకు ఉంటాయి. యాత్ర  మాత్రం కేవ‌లం వై.ఎస్ చేసిన పాద‌యాత్ర వరకే పరిమితం అయ్యింది. ఐతే పాదయాత్ర ప్రారంభించ‌డానికి ముందు సాగిన సంఘ‌ర్ష‌ణ‌ని చాలా బ‌లంగా చూపించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఎలా ఎదుర్కోవాలి.. ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన ఆ పార్టీని ఓడించి అధికారంలోకి ఎలా రావాలన్న వైఎస్ మనోభిష్టానికి సంబందించిన ఘటనలను ఆరంభ స‌న్నివేశాల్లో చూపిస్తూ యాత్ర క‌థ‌ని మొద‌లుపెట్టారు. మ‌న గ‌డ‌ప తొక్కి సాయం అడిగిన ఆడ‌బిడ్డ‌తో ఏందిరా రాజ‌కీయం అనే డైలాగ్ తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్య‌క్తిత్వాన్ని ఆవిష్క‌రించి… త‌నవాళ్లు అనుకున్నాక ఆయ‌ిన వాళ్ల కోసం ఎంతదూర‌మైనా వెళ‌తాననే విష‌యాన్నితన ప్రాణ స్నేహితుడు కేవీపీ రాంచంద్రా రావు పాత్ర‌తో చూపించారు. చేవెళ్ల నుంచి వైఎస్ పాద‌యాత్ర ప్రారంభ స‌న్నివేశాలతో పాటు భావోద్వేగాలు మొదలవుతాయి.

yatra

ఇక ఇంటర్వెల్ తరువాత పార్టీని మించిన లీడర్ గా వైఎస్ ఎలా ఎదిగార‌నే అంశాల్ని ఎస్టాబ్లిష్ చేశారు. వై.ఎస్‌.విజ‌య‌మ్మ‌, కేవీపీ, స‌బితా ఇంద్రారెడ్డి, వీహెచ్ త‌దిత‌రుల పాత్ర‌లతో పాటు.. కొన్ని క‌ల్పిత పాత్ర‌ల్ని, క‌ల్పిత సన్నివేశాలను కూడా సినిమాలో చూపించారు. పార్టీ అధిష్టానానికి ఏమాత్రం న‌చ్చ‌ని వ్య‌క్తిగా, అధిష్టానాన్ని ఎదిరించిన వ్య‌క్తిగా వై.ఎస్‌ని చూపించారు. సినిమాలో చాలావ‌ర‌కు స‌న్నివేశాలు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి తీసిన ఓ డాక్యుమెంట‌రీలా అనిపించకమానవు. సినిమాలో ఆఖరి ఐదు నిమిషాల స‌న్నివేశాల్ని వై.ఎస్‌కి సంబంధించిన నిజ‌మైన విజువ‌ల్స్‌ని, ఆయ‌న అకాల మ‌ర‌ణానికి సంబంధించిన దృష్యాలను, తండ్రి మ‌ర‌ణించాక ప్ర‌జ‌ల ముందుకొచ్చి మాట్లాడిన జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని ఒక పాట బ్యాక్ ట్రాప్ లో చూపించారు.

yatra

అంతా ఇలా చేశారు….

వైఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మమ్ముట్టి ఒదిగిపోయారు. మమ్ముట్టి వైఎస్‌ లా క‌నిపించ‌క‌పోయినా, ఆయ‌న హావ‌భావాల్ని అనుక‌రించ‌క‌పోయినా ఆ పాత్ర ఆత్మ‌ని అర్థం చేసుకుని న‌టించారు అనే కంటే.. జీవించారని చెప్పవచ్చు. అంతే కాదు మమ్ముట్టి సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. సినిమాలో భావోద్వేగాలు, సెంటిమెంట్‌ పండ‌టంలో మ‌మ్ముట్టిదే కీలక పాత్ర. ఇక వై.ఎస్‌.విజ‌య‌మ్మ పాత్ర‌లో ఆశ్రిత వేముగంటి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడైన కేవీపీ రామ‌చంద్ర‌రావు పాత్ర‌లో రావు ర‌మేష్ ఒదిగిపోయారు. వై.ఎస్‌ తండ్రి రాజారెడ్డి పాత్ర‌లో సీనియర్ నటుడు జ‌గ‌ప‌తిబాబు బాగా నటించారు. కె సంగీతం, సూర్య‌న్ కెమెరా ప‌నిత‌నం పరవాలేదు. చివరగా చెప్పాలంటే మాత్రం.. వైఎస్ బయోపిక్ అనే కంటే.. కేవలం వైఎస్ పాదయాత్ర సినిమా అంటే బావుంటుందేమో. ఎందుకంటే సినిమాలో కేవలం వైఎస్ పాదయాత్ర వరకు మాత్రమే చూపించారు. అది కూడా సినిమాలా కాకుండా ఓ డాక్యుమెంటరీలా రూపొందించారు.

సినిమా పిల్లర్ రేటింగ్- 2.5/5

నోట్- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Leave A Reply

Your email address will not be published.