భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాల మహిళలకు చోటు దక్కింది. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేశారు. ఈమేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త టీమ్‌ను ప్రకటించారు. జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారి ఈ నియామకాలను జరిపారు. రాష్ట్రాల్లో నాయకత్వాన్ని పెంపొందించే క్రమంలో నియామకాలు చేపట్టారు.
పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా డీకే అరుణను, డాక్టర్ రమణ్ సింగ్, ముకుల్ రాయ్, అన్నపూర్ణ దేవి, బైజయంత్ జే పాండాలను నియమించారు. అటు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను సైతం బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రామ్ మాధవ్, మురళీధర్ రావు, అనిల్ జైన్లకు ప్రధాన కార్యదర్శుల బాధ్యతల నుంచి తప్పించారు. పంజాబ్‌కు చెందిన తరుణ్ చుగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజను పార్టీ సెక్రటరీగా నియమించారు. ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ ను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించారు.