ఈనెల 28న సోమవారం గవర్నర్ ను కలిసి కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ లేఖ ఇవ్వనున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఏఐసీసీ ఇంచార్జి మాణికమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సోమవారం జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలియజేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 29 మంగళవారం అన్ని నియోజక వర్గ కేంద్రాలలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మండలి ఎన్నికలలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పెద్దఎత్తున ప్రచారం చేసి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనేలా చేయాలని దిశానిర్ధేశం చేశారు. 30న మధ్యాహ్నం 2 గంటలకు జూమ్ ఆప్ లో కాంగ్రెస్ నేతలకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఉత్తమ్ తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వ్యవసాయ వ్యతిరేక బిల్లులను కేంద్రం ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నేతలకు చెప్పారు.