నివర్ తుఫాను వేగంగా దూసుకొస్తోంది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిల్లో కుండపోత వర్షాలతో బీభత్సం సృష్టిస్తోంది. బుధ, గురువారాల్లో ఆంధ్రాప్రదేశ్ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం మంగళవారం తుఫానుగా మారింది. సాయంత్రానికి పుదుచ్చేరికి 350 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. నివర్ తుఫాను బుధవారం సాయంత్రం తమిళనాడులోని మహాబలిపురం, పుదుచ్చెరిలోని కరైకల్ నడుమ తీరం దాటనుంది.
తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు విస్తాయని, భారీగా వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. నెల్లూరు జిల్లా, రాయలసీమలో మంగళవారం చెదురుమదురు నుంచి తేలికపాటి జల్లులు పడ్డాయి. బుధ, గురువారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ సూచించారు. భారీ వర్షాల నేపధ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బుధవారం ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు.