గ్రేటర్ ప్రచారంలో ప్రజల సమస్యలపై చర్చించకుండ టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ పార్టీలను హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్, బంజారా హిల్స్, శేరిలింగం పల్లి డివిజన్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. మంత్రి కేటీఆర్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదని వ్యాఖ్యానించారు.
ప్రజల సమస్యలను లేవనెత్తిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో సాధ్యమైన పరిష్కారాలను కూడా ప్రతిపాదించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారని, గ్రేటర్ వాసులు కాంగ్రెస్కు ఓటు వేస్తారన్న నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఎవరూ హైదరాబాద్ లో కనిపించరని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వాసులు సరైన నిర్ణయం తీసుకొని న్యాయంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.