ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో అధికార వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సీఎం జగన్ పై విమర్శలు గుప్పించగా… అందుకు స్పందించిన ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఐతే సీఎం సమాధానంపై మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా.. చంద్రబాబు ఎలా మాట్లాడతారంటూ అధికార పక్షం అడ్డుకుంది. అధికార పక్షం తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా స్పీకర్ పోడియం ఎదుట చంద్రబాబు బైఠాయించారు. చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. వయస్సుకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహరించాలని వైఎస్ జగన్ అన్నారు. సభలో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. చంద్రబాబు సహా మొత్తం 12 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.