News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

జన్వాడలో కేటీఆర్ రాజభవనం!! జీవో 111లో అక్రమ నిర్మాణం…

  • పిరంగి కాల్వ ఆక్రమణ
  • మీడియాను తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ..
  • అడ్డుకున్న పోలీసులు .. తోపులాట… కొండా కాలికి గాయం .. అనంతరం అరెస్టు

హైదరాబాద్ శివార్లలోని 111 జీవో పరిధిలో కేటీఆర్ అక్రమ రాజమహల్ నిర్మాణాన్ని మీడియాకు చూపించేందుకు వెళ్లిన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కాసేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
జన్వాడ గ్రామంలో 111 జీవో పరిధిలోకి వచ్చే భూముల్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్మించుకున్న అక్రమ కట్టడం వద్దకి సోమవారం ఎంపీ రేవంత్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిలు మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లారు. కేటీఆర్ బినామీ ఫాం హౌస్ ను సమీపం నుంచి చూపించడమే కాక… దానికి సంబంధించి వివరాలను, ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.KTR,Palace in Janwada,Illegal construction,Jio 111,hyderabad

జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 301, 302, 312, 313 లలో తన స్నేహితులైన రాజులు, వారి కుటుంబ సభ్యుల పేరుతో కేటీఆర్ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో, మూడంతస్థుల రాజమహల్ కట్టుకున్నారని రేవంత్ రెడ్డి మీడియాకు చూపించారు. 25 ఎకరాలలో అక్రమంగా ఈ భవనాన్ని నిర్మించారని ఆరోపించారు. ఈ మహల్ సమీపంలో చిన్న సముద్రం చెరువు నుంచి పిరంగి కాల్వ వెళ్లి గండికోటలో కలుస్తుంది. ఈ పిరంగి కాల్వను పూర్తిగా పూడ్చేసి… దానిపై కేటీఆర్ ఈ మహల్ నిర్మించారని ఆరోపించారు. ఆ భూమి సమీపంలో భూములు ఉన్న మహిపాల్ రెడ్డి, మరికొందరిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి బెదిరించి మరీ ఆ భూములు గుంజుకున్నారని రేవంత్ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాల మేరకు అమలులో ఉన్న 111 జీవో ప్రకారం నీటి సంరక్షణ ప్రాంతాలైన హిమాయత్ సాగర్, గండిపేటల చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని… ఇక్కడ అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా… కేటీఆర్ రాజమహల్ జోలికి అధికారులు ఎందుకు వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. యువరాజు కట్టుకున్న ఈ ఇంద్రభవనంలో ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నారో చెప్పాలన్నారు.

- Advertisement -

రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకుని ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి – పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాము ప్రైవేటు భూమిలో నిలబడి ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. కేటీఆర్ ఫాం హౌస్ కు పోలీసులు కాపలాకాస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంతలా వారిస్తున్నా పోలీసులు వాళ్లను ఈడ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో రేవంత్ రెడ్డి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ, మాజీ ఎంపీలతో ఇలాగేనా వ్యవహరించేది అని మండిపడ్డారు. ఎవరు ఫిర్యాదు ఇస్తే ఇక్కడికి వచ్చారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. భద్రతా సమస్య ఉందని పోలీసులు చెప్పడంతో… ఎవరికి భద్రత, ఫాంహౌస్ లో ఎవరున్నారు… అని ప్రశ్నించారు. తాము ఓ ప్రైవేటు స్థలంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుని, ఒక అంశాన్ని మీడియాకు వివరించే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకునే అధికారం పోలీసులకు ఎక్కడిదని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పోలీసులు కూడా క్రియాశీలకంగా వ్యవహరించారని… మీరు కూడా తెలంగాణలో భాగస్వాములేనని…మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాగ్వాదం, తోపులాట సందర్భంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కాలికి గాయం అయింది. చివరికి పోలీసులు బలవంతంగా రేవంత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డితో పాటు ఇతర స్థానిక నేతలను అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించారు.KTR,Palace in Janwada,Illegal construction,Jio 111,hyderabad

Tags: KTR,Palace in Janwada,Illegal construction,Jio 111,hyderabad

Leave A Reply

Your email address will not be published.