News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆర్టీసీని, ఆర్టీసీ ఆస్తులను అమ్మాలన్నదే కేసీఆర్ లక్ష్యం: మందకృష్ణ

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో గురువారం  విచారణ జరిగిన సంద‌ర్భంగా….ఆర్టీసీ ఎండీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన  రెండు నివేదికలు వేరుగా ఉండడంతో న్యాయస్థానం మండిపడింది. ఓ ఐఏఎస్‌ స్థాయి అధికారులు ఈ విధంగా కోర్టుకు అసంపూర్ణంగా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. తన 15 ఏళ్ల  సర్వీసులో ఇంత  దారుణంగా  తప్పుడు వివరాలు  సమర్పించిన  ప్రభుత్వ అధికారులను  చూడలేదని సీజే ఆర్‌ఎస్‌ చౌహాన్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

ఇలా న్యాయ‌మూర్తులు సైతం ఘాటు వ్యాఖ్య‌లు చేసిన అంశం ఓవైపు ఉండగా తాజాగా, ఎమ్మార్పీఎస్ నేత మంద‌కృష్ణ మాదిగ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టీసీని, ఆర్టీసీ ఆస్తులను అమ్మాలన్నదే కేసీఆర్ లక్ష్యమని, ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేయాలన్నదే అతని కల అని మందకృష్ణ మండిప‌డ్డారు. కోర్టు హెచ్చరికల చివరి రూపమే సీఎస్‌ను , ఆర్టీసీ ఎండీని, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని బోనులో నిలబెట్టిందని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ రాజకీయ పార్టీలను, ప్రజలను ఆర్టీసీ కార్మికుల నుంచి దూరం చేయాలని సీఎం కేసీఆర్ కుట్ర చేశాడని, కానీ ఆ విషయంలో విజయం సాధించలేకపోయాడన్నారు. అవసరమైతే కొంత మంది కార్మికులపై ఛలో సరూర్ నగర్ సందర్భంలో వారిపై కాల్పులు జరిపి
ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని కూడా భావించాడన్నారు.

100 ఏళ్ల క్రితం అమలైన  కెనడా ఫార్మూలాను తెలంగాణలో అమలు చేయాలని కేసీఆర్ కుట్ర పన్నాడని మంద‌కృష్ణ మండిప‌డ్డారు. “లోటు బడ్జెట్ ఉన్న ఏపీ ఆర్టీసీని విలీనం చేస్తే…మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఎందుకు చేయలేకపోతుంది?కేసీఆర్‌కు, ఆయన భజన పరులకు నిన్నటి వరకు తమ అక్రమ సంపాదనకు కాళేశ్వరం కేరాఫ్ అయ్యింది. ఇపుడు కాళేశ్వరంపై కేంద్రం కన్నేయటంతో కేసీఆర్ దృష్టి ఆర్టీసీపై పడింది.

- Advertisement -

ఆర్టీసీని విలీనం చేస్తే… మిగతా కార్పోరేషన్ల నుంచి డిమాండ్లు వస్తాయని కేసీఆర్ కొత్త వాదన లేవనెత్తాడు. ఆర్టీసీ పుట్టుకతోనే ప్రభుత్వ రంగం. మిగతా 90 కార్పోరేషన్లతో ఆర్టీసీకి సంబంధం లేదు” అని ప్రశ్నించారు. టీఎన్జీవో నాయకులు ఆర్టీసీ జేఏసీకి అండగా నిలవాలి కాని,  కేసీఆర్ కు వంతపాడి ఆర్టీసీ కార్మికులను వెన్నుపోటు పొడవద్దని మంద‌కృష్ణ సూచించారు. “ఓటమి దిశగా కేసీఆర్ , గెలుపు దిశగా కార్మికులున్నారు.  ప్రజలు కూడా ఆర్టీసీని కాపాడేది కార్మికులేనని భావిస్తున్నారు.“ అని మందకృష్ణ అన్నారు.

Tags: mandha krishna madiga, sensational comments, kcr, tsrtc merge

Leave A Reply

Your email address will not be published.