KCR Bus Yatra

మళ్లీ మన రాజ్యమే ఎవరూ ఆపలేరు.. జైళ్లకు కేసీఆర్‌ భయపడడు

నల్గొండ రిపోర్ట్- తెలంగాణకు  1956 నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్‌ పార్టీయే శత్రువని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అన్నారు. తెలంగాణ ప్రజలు వద్దంటున్నా గతంలో ఆంధ్రప్రదేశ్ లో కలిపి 58 ఏళ్లు గోస పెట్టారని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు అడ్డగోలు హామీలతో మోసం చేసి తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు కేసీఆర్. మళ్లీ మన రాజ్యమే వస్తుందని, దీన్ని ఎవరూ ఆపలేరరి జోస్యం చెప్పారు గులాబీ బాస్. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేవరకు విశ్రమించేది లేదని కేసీఆర్ అన్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోరుబాట బస్సుయాత్రను నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి బుధవారం మొదలుపెట్టారు కేసీఆర్. మిర్యాలగూడ, సూర్యాపేటల్లో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలు, కార్నర్ మీటింగ్స్ లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మంత్రుల అసమర్థత వల్ల సాగర్‌ ప్రాజెక్టుకు దుస్థితి దాపురించిందని ఈ సందర్బంగా ఫైర్ అయ్యారు కేసీఆర్. తనను జైలుకు పంపిస్తానని, తెలంగాణలో తన ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారని చెప్పిన కేసీఆర్.. తాను జైళ్లకు భయపడబోడని స్పష్టం చేశారు. అలా భయపడి ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు.

ప్రత్యేక బస్సులో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు బయల్దేరిన కేసీఆర్‌ చౌటుప్పల్‌, చిట్యాల, నార్కట్‌పల్లి క్రాస్‌రోడ్‌, నల్గొండ బైపాస్‌, తిప్పర్తి మీదుగా సాయంత్రానికి మిర్యాలగూడ చేరుకున్నారు. నల్గొండ సమీపంలోని అర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్యాలగూడ రోడ్‌షోలో మాట్లాడాకా, సూర్యాపేటకు బయల్దేరారు కేసీఆర్. నకిరేకల్‌, కేతేపల్లిలో ప్రజలు కేసీఆర్‌ బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాక కేసీఆర్ సూర్యాపేటకు చేరుకొని భారీ ర్యాలీతో రోడ్‌షోలో ప్రసంగించి ఇక్కడే బస చేశారు.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వార ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లోని 2.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లిచ్చామని ఈ సందర్బంగా కేసీఆర్ చెప్పారు. సూర్యాపేటను జిల్లా కేంద్రం చేశామని చెప్పిన ఆయన.. ఇక్కడ మెడికల్ కాలేజ్ తో పాటు సద్దుల చెరువును అందంగా మార్చామని చెప్పుకొచ్చారు. కోదాడ, సూర్యాపేటల్లో ఎడారుల్లా మారిన చెరువులను కాళేశ్వరం జలాలతో నింపామని గుర్తు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు సూర్యాపేట ప్రజలకు 30 ఏళ్ల పాటు మూసీ మురికినీళ్లు తాగించాయని మండిపడ్డారు.


Comment As:

Comment (0)