Chandra Babu Jagan

ఏపీలో వ్యవస్థలను చంపేసి రివర్స్‌గేర్‌ లో నడిపిస్తున్నారు

ఏపీలో బాగా పండే పంట గంజాయి - సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

పొలిటికల్ రిపోర్ట్- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan) అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని టీడీపీ (TDP) అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంపేసి రివర్స్‌గేర్‌ లో నడిపిస్తున్నారని విమర్శించారు. అమరావతి (Amaravathi) లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలో సంక్షోభానికి కారణమైన జగన్‌కు పరిపాలించే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో గంజాయి పంట మినహా అన్నీ సంక్షోభంలో ఉన్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రైతులు తమ సమస్యలు చెబితే వారిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జగన్‌ పాలనలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయే మాత్రమేనని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు టమాటా (Tomato) వేయడం మానేశారని, ఇప్పుడు టమాటా ధరలు పెరగడానికి ఇదే కారణమని అన్నారు. కరోనా సమయంలో రైతు ఒక్కడే బయటకొచ్చి దేశానికి అన్నం పెట్టాడన్న చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రస్తుతం 93 శాతం మంది రైతులు అప్పులపాలయ్యారని ఆవేధన వ్యక్తం చేశారు.

తెలుగు దేశం (Telugu Desham) హయాంలో రాయలసీమలో హార్టికల్చర్‌, కోస్తాలో ఆక్వాకల్చర్‌కు ప్రాధాన్యమిచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీలో భూముల ధరలు, వ్యవసాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కామెంట్లు చేస్తున్నారని అన్నారు. వరి రైతుకు గిట్టుబాటు ధర లేదన్న చంద్రబాబు.. ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. రైతులపై వైఎస్సార్ ప్రభుత్వం అప్పుల భారం మోపిందని, సీఎం జగన్‌ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు చంద్రబాబు. 

ఇక అమరావతిలో రాజధాని రైతుల భూమి వేరొకరికి దానం చేసిన జగన్‌ దానకర్ణుడా అని నిలదీసిన చంద్రబాబు.. అంత దానం చేసే గుణమే ఉంటే తన భూమి ఇవ్వొచ్చుగా అని అన్నారు. ఆర్‌-5 జోన్‌ లో ఇళ్ల నిర్మాణానికి కోర్టు అనుమతి వచ్చిందా అని ప్రశ్నించిన బాబు.. ఏపీ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేధన వ్యక్తం చేశారు.


Comment As:

Comment (0)