Shiva Jyothi

భర్తను చంపేసి.. ఏమీ తెలియనట్టు నటించి..

ప్రియుడి మోజులో పడి భర్త హత్య - కానిస్టేబుల్ భార్య ఘాతుకం

విశాఖపట్నం క్రైం రిపోర్ట్- ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్య ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. భర్తను హత్య చేసి ఆ తరువాత గుండెపోటుగా చిత్రీకరించంది. విశాఖపట్నం (Vishakapatnam) వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహిస్తున్న బర్రి రమేష్‌ కుమార్‌ (40) (Barri Ramesh Kumra), భార్య శివజ్యోతి (Shiva Jyothi) తో కలిసి ఎంవీపీ కాలనీలో ఉంటున్నాడు. ఈ నెల ఒకటో తేదీన విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన రమేష్‌ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడంటూ భార్య శివజ్యోతి ఎంవీపీ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో సీఐ మల్లేశ్వర రావు ఘటనా స్థలికి చేరుకుని విచారించారు. రమేష్ కుమార్ భార్య శివ జ్యోతి ప్రవర్తనపై అనుమానం రావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో తాము అన్యోన్యంగానే ఉంటున్నామని శివజ్యోతి కొన్ని వీడియోలు పోలీసులకు చూపించింది. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడటంతో  మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించగా, పోస్టుమార్టం రిపోర్ట్ లో రమేష్ ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. శివజ్యోతిని తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శివజ్యోతి ఇంటి ఎదురుగా నివసించే రామారావు (Ramarao) ఆమె ఇంటి పక్కనే ప్రతి రోజు కారు పార్కింగ్‌ చేసేవాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. సుమారు ఏడాదిన్నరగా వీరి మధ్య వివాహేతర సంబంధం (Extramarital Affair) కొనసాగుతోంది.

వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం గమనించిన  రమేష్‌, ఓసారి రామారావుతో గొడవ పడ్డాడు. ఆ తరువాత శివజ్యోతి రామారావుతో కలిసి కొన్ని రోజులు బయటకు వెళ్లిపోయింది. దీంతో ఇరు వర్గాల కుటుంభ సభ్యులు రమేష్‌ కు నచ్చజెెప్పి శివజ్యోతిని మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. ఐనప్పటికీ వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవి. ప్రియుడు రామారావు దగ్గరికే వెళ్లిపోవాలని శివజ్యోతిని రమేష్‌ ప్రతి సందర్బంలోను కోపగించుకునేవాడు. ఐతే ఇద్దరు పిల్లలను తీసుకొని మరీ రామారావు దగ్గరకు వెళ్తానని శివజ్యోతి చెప్పడంతో గొడవ మరింత ముదిరింది.

భర్త రమేష్  అడ్డు తొలగించుకుంటే తప్ప రామారావు దగ్గరకు వెళ్లే అవకాశం లేదని శివజ్యోతి నిర్ణయించుంకుంది. భర్త హత్యకు శివజ్యోతి తన ప్రియుడు రామారావుతో కలిసి పధకం వేసింది. తన వద్దనున్న బంగారం 1.50 లక్షలకు అమ్మి, వెల్డింగ్‌ పనులు చేసే నీలాకు (Neela) సుపారీ ఇచ్చింది. ఈనెల ఒకటో తేదీ రాత్రి రమేష్‌ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయాడు. ఆ తరువాత పధకం ప్రకారం నీలాను పిలిచారు. రమేష్‌ ముఖంపై నీలా దిండు పెట్టి గట్టిగా అదిమిపట్టుకోగా, శివజ్యోతి  రమేష్ కదలకుండా కాళ్లు పట్టుకొని ప్రాణాలు తీశారు. ఇంటి బయట ఎవరూ రాకుండా రామారావు కాపాలా ఉన్నాడు.

భర్త రమేష్ ను హత్య చేసి సాధారణ మృతిగా చిత్రీకరించి ఉద్యోగం పొందాలని, ఆ తరువాత భర్త మరణంలో వచ్చే ప్రయోజనాలను తీసుకోవాలని శివజ్యోతి ప్లాన్ చేసింది. అలా ఐతే రామారావుతో కలిసి హాయిగా ఉండాలనుకుంది. కానీ చివరికి భర్తను హత్య చేసి పోలీసులకు దొరికిపోయింది. 3, 5 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు అనాధలయ్యారు. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో ఎ1గా శివజ్యోతి, ఎ2గా రామారావు, ఎ3గా నీలాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు.


Comment As:

Comment (0)