Newspillar
Newspillar
Thursday, 06 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ న్యూస్- కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహూల్ గాంధీ (Rahul Gandhi) కి కోర్టులో చుక్కెదురైంది. మోదీ (Modi) ఇంటిపేరు పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసు (Defamation Case) లో రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. తనకు సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను రద్దు చేయాలని రాహూల్ వేసిన స్టే పిటిషన్‌ ను గుజరాత్‌ హైకోర్టు (Gujarat HC) కొట్టేసింది. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. 

రాహుల్‌ గాంధీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కేసులను ఎదుర్కొంటున్నారని.. ఇక ఈ కేసులో ఆయనకు కిందికోర్టు శిక్ష విధించడం సరైనదేనని ఈ సందర్బంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. తమకు ఈ శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదని.. అందుకే పిటిషనర్‌ అభ్యర్థనను కొట్టేస్తున్నామని విచారణ సందర్బంగా జస్టిస్‌ హేమంత్‌ ప్రచక్‌ కామెంట్ చేశారు. గుజరాత్‌ హైకోర్టు తీర్పుపై రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టుకు ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై గుజరాత్ హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు కొనసాగనుంది. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుజరాత్‌ హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయవర్గాలు అంటున్నాయి. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో.. అంటూ 2019 లోక్‌ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహూల్ గాంధీ కర్ణాటకలోని కోలార్‌లో చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. 

దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువర్చిన 24 గంటల్లోనే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది.