Newspillar
Newspillar
Wednesday, 12 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

ఏపీ స్పెషల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణిని ఎప్పుడూ వివాదాల్లోకి లాగలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. రెండవ విడత వారాహి యాత్ర తాడేపల్లిగూడెం చేరుకున్న సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం రోజు జగన్‌ తనను ఆహ్వానించారని, ప్రత్యర్థులుగా ఉన్నందుకే తాను రాలేనని ఆరోజు చెప్పానని పవన్ గుర్తు చేశారు.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటానని చెప్పానని.. జగన్‌ ను వ్యక్తిగతంగా తాను ఎప్పుడూ విమర్శించలేదని చెప్పారు. మేం ఎప్పుడూ సీఎం జగన్‌ సతీమణిని వివాదాల్లోకి లాగలేదన్న పవన్ కళ్యాణ్.. కానీ, జగన్‌ కు సంస్కారం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉండే అర్హత జగన్ కు లేదని కామెంట్ చేశారు. వాలంటీరు అంటే జీతం ఆశించకుండా పనిచేసే వ్యక్తి అని, వాలంటీర్ల కేంద్రం హైదరాబాద్‌ నానక్‌ రామ్‌ గూడలో ఉందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ డేటా మొత్తం హైదరాబాద్ లోని నానక్‌ రామ్‌ గూడ లోనే ఉందని.. నానక్‌రామ్‌గూడలోని ఓ ఏజెన్సీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం ఎందుకు ఇచ్చారో జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై తనకు వ్యక్తిగతంగా ద్వేషం లేదన్న పవన్.. వ్యవస్థ పనితీరు గురించే మాట్లాడుతున్నానని చెప్పారు. ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని భయపెడుతున్నారని, ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో కొందరు వాలంటీర్లు పట్టుబడ్డ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.