Newspillar
Newspillar
Monday, 31 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

రంగారెడ్డి-గ్రేటర్ సిటీ రిపోర్ట్- విశ్వ నగరం హైదరాబాద్‌ (Hyderabad) లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ సిటీలో మూడో దశ మెట్రో (Metro Rail) విస్తరణలో భాగంగా 278 కిలో మీటర్ల పొడవున కొత్తగా ఎనిమిది మార్గాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించాలని తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో ప్రఖ్యాత ఫార్మా సిటీ రానుండడంతో శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ నుంచి జల్‌ పల్లి, తుక్కుగూడల మీదుగా కందుకూరు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. ఈ మొత్తం మోట్రో విస్తరణ కోసం 69,100 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

హైదరాబాద్‌ లో ఇప్పటికే 70 కిలోమీటర్ల మేర విస్తరించిన మెట్రోకు అదనంగా, రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా జూబ్లీ బస్టాండ్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో మార్గాన్ని నిర్మించనుండగా, దానిపై ఒక అంచెలో వాహనాలు, మరో అంచెలో మెట్రో రైలు వెళ్తుంది. ఇక సికింద్రాబాద్ ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా డబుల్‌ డెక్కర్‌ మార్గం నిర్మించాలని నిర్ణయించారు. పటాన్ చెరు సమీపంలోని ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌ కు, అక్కడి నుంచి లక్డీకాపూల్‌ వరకు, విజయవాడ రూట్ లో ఎల్బీనగర్‌ నుంచి హయత్‌ నగర్‌ మీదుగా పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో నిర్మాణం ఉంటుంది.

మరోవైపు ఉప్పల్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ వరకు, శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ నుంచి మెట్రో విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో బెంగళూరు హైవేపై ఉన్న కొత్తూరు, అటు తరువాత షాద్‌నగర్‌ వరకు మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు. నాలుగేళ్లలో ఈ భారీ మెట్రే రైల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశిస్తున్నారు. Hyderabad Metro Rail