Newspillar
Newspillar
Tuesday, 08 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

న్యూ ఢిల్లీ రిపోర్ట్- పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul gandhi) తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు కొందరు ఆరోపించారు. లోక్ సభలో మోదీ సర్కార్ పై అవిశ్వాసంపై చర్చ సందర్బంగా తన ప్రసంగం పూర్తికాగానే రాహుల్ గాంధీ సభ నుంచి బయటకు వెళుతూ వెళుతూ ఫ్లయింగ్‌ కిస్‌ (Rahul flying kiss) ఇచ్చారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఆరోపించారు. దీనిపై బీజేపీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్‌ కు ఫిర్యాదు చేశారు స్మృతి ఇరానీ. ఇప్పుడీ అంశం కలకలం రేపుతోంది.

కేంద్ర ప్రభుత్వంపై ఇండియా పార్టీల అవిశ్వాసంపై లోక్ సభలో (Lok Sabha)చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ముందు రాహుల్‌ గాంధీ మాట్లాడారు. తన ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆయన సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూనే ఆయన మహిళా ఎంపీలకు ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. రాహుల్‌ గాంధీ వైఖరిపై ఆమె సభలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్‌ లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరని.. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదని ఆమె కామెంట్ చేశారు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోందని.. ఇది అసభ్యకరమైంది అంటూ స్మృతి ఇరానీ, రాహూల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

లోక్ సభలో రాహూల్ గాంధీ తన ప్రవర్తనతో మహిళలను అవమానించారని ఆరోపిస్తూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్‌ కు ఫిర్యాదు చేశారు. పిర్యాదుకు సంబంధించిన లేఖపై మొత్తం 20 మంది మహిళా సభ్యులు సంతకాలు చేశారు. స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ ఆయన అసభ్యకరమైన సంజ్ఞ చేశారని అందులో పేర్కొన్నారు. సభలోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి కాంగ్రెస్‌ నేత రాహూల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. ఐతే ఈ ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేశాయి. ఆయన ఏ ఒక్కరినో ఉద్దేశించి ఆ సంజ్ఞ చేయలేదని స్పష్టం చేశాయి. మొత్తానికి రాహూల్ గాంధీపై ఫ్లైయింగ్ కిస్ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.