Newspillar
Newspillar
Saturday, 19 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

బెంగళూరు రిపోర్ట్- భారత అంతరిక్ష కేంద్రం- ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) లో అత్యంత కీలకఘట్టం విజయవంతంగా పూర్తయింది. రెండవ, చివరి డీ-బూస్టింగ్‌ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రక్రియతో చందమామ అత్యంత దగ్గరి కక్ష్యలోకి విక్రమ్‌ మాడ్యూల్‌ (Vikram) చేరింది. చంద్రుడి నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ ప్రస్తుతం అత్యల్పంగా 25 కిలో మీటర్లు, అత్యధికంగా 134 కిలో మీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో తిరుగుతోంది. ఈ కీలక ఘట్టం పూర్తవ్వడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే ఇక తరువాయి.

ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం చివరి దశ, అత్యంత కీలకమైన విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ (Vikram Soft Landing) పై దృష్టి సారించారు. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రుడి దక్షిణధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టనుంది. మాడ్యూల్‌ ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉందని, ఎంచుకున్న ల్యాండింగ్‌ సైట్‌ లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నామని ఇస్రో ఎక్స్- ట్విట్టర్ లో పేర్కొంది. చందమామపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు మొదలవుతుందని ఇస్రో ప్రకటించింది. మరోవైపు రష్యాకు చెందిన లూనా-25 (Luna-25) సైతం చంద్రుడిపై ల్యాండ్ కాబోతోంది.