Newspillar
Newspillar
Sunday, 20 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

అదిలాబాద్ క్రైం రిపోర్ట్- ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బ్యాంక్‌లో పని భారం ఎక్కువగా ఉందని మేనేజర్ సూసైడ్ చేసుకున్నాడు. బ్యాంకులో ఇద్దరు చేసే పని తానొక్కడినే చేస్తున్నానని చాలా సార్లు భార్యతో చెప్పుకుని బాధపడ్డ మేనేజర్ ఆఖరికి ఒత్తిడి తట్టుకేలక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తన గుండెలో ఉన్న బాధను మిత్రులతో చెప్పలేక తనలో తానే మదన పడుతూ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) లో మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్న బానోతు సురేష్‌ (35) (Banoth Suresh) ఈ నెల 17న రాత్రి 7.30 గంటల సమయంలో బ్యాంకులోనే ముందుగా తెచ్చుకున్న పురుగుల మందు తాగి, కాసేపటికి వాంతులు చేసుకున్నారు.

అది గమనించిన బ్యాంకు సిబ్బంది ఏమైందని సురేష్ ను ప్రశ్నించగా ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. సిబ్బంది వెంటనే ఆసిఫాబాద్‌ లో ఉంటున్న భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఆసిఫాబాద్‌ గవర్నమెంట్ హాస్పిటల్ కుతరలించారు. అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. కుటుంబ సభ్యులు సురేష్ ను మంచిర్యాల హాస్పిటల్ కు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. దీంతో అక్కడి నుంచి కరీంనగర్‌ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారు సురేష్. బ్యాంకులో పనిభారం ఎక్కువైందని భార్య ప్రియాంకతో చెబుతుండే వాడని, ఒత్తిడిని తట్టుకేలక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తండ్రి లక్ష్మీరాజం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బానోతు సురేష్‌ బలవన్మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగారు. దీనిపై బ్యాంకు అధికారులు సైతం విచారణ జరుపుతున్నారు.