Newspillar
Newspillar
Wednesday, 23 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్-  ఈ మధ్య కాలంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా గూగుల్ ను అడగటం, లేదంటే యూట్యూబ్ చూడటం అలవాటైంది అందరికి. ఇదిగో ఇలాగే యూట్యూబ్‌ చూసి భార్యకు ప్రసవం చేశాడో ఓ భర్త. చివరికి మగశిశువుకు జన్మనిచ్చి అతని భార్య కన్నుమూసింది. ఈ  విషాదకర ఘటన తమిళనాడులోని (Tamilanadu) కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి (Lokanayaki) ధర్మపురి జిల్లాలోని అనుమంతపురం గ్రామవాసి మాదేశ్‌ తో 2021లో పెళ్లి జరిగింది. మాదేశ్‌ (Madesh) సేంద్రియ వ్యవసాయ చేసే రైతు. ఈ క్రమంలో భార్య ఇటీవల గర్భం దాల్చగా, ఆర్గానిక్ పద్ధతిలాగే ఆమెకు కూడా ఎలాంటి మందులు లేకుండా సహజ పద్ధతిలో ప్రసవం జరగాలని అనుకున్నాడు. అందుకే లోకనాయకికి కనీస వైద్యపరీక్షలు కూడా చేయించలేదు.

స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఆమె పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాలని చెప్పినా మాదేశ్‌ మాత్రం వినిపించుకోలేదు. అంతే కాదు ప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లతో పాటు పౌష్టికాహారాన్నీ కూడా తీసుకోలేదు. తనే స్వయంగా ఆమెకు గింజలు, ఆకుకూరలు ఆహారంగా అందిస్తూవచ్చాడు. ఆగస్టు 22న లోకనాయకికి ప్రసవ నొప్పులు రావడం మొదలయ్యాయి. మాదేశ్‌ తన స్మార్ట్ ఫోనులో యూట్యూబ్‌ చూస్తూ తానే స్వయంగా భార్యకు  ప్రసవం చేశాడు. ఈ క్రమంలో మగశిశువుకు జన్మనిచ్చిన వెంటనే లోకనాయకి కోమా స్థితిలోకి వెళ్లిపోయింది. అప్పుడు ఇక తప్పనిసరి పరిస్తితుల్లో కున్నియార్‌ లోని హాస్పిటల్ కు ఆమెను తరలిస్తుండగా మార్గమధ్యంలో లోకనాయకి చనిపోయింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోచంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లోకనాయకి భర్తపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.