Newspillar
Newspillar
Sunday, 03 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- తెలంగాణలోని గద్వాల (Gadwal) శాసనసభ నియోజవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణ (DK Aruna) ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ (CEC) లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌ లో ప్రచురించాలని ఆదేశాల్లో పేర్కొంది ఈసీ. తెలంగాణ సీఈవోకు ఈసీ అండర్‌ సెక్రెటరీ సంజయ్‌ కుమార్‌ లేఖ రాయడంతో పాటు హైకోర్టు తీర్పు కాపీని జతచేశారు.

తెలంగాణలోని జోగులాంబ జిల్లా గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బి. కృష్ణమోహన్‌ రెడ్డి (B Krishnamohan Reddy) ఎన్నిక చెల్లదని ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది. నామినేషన్‌ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు శిక్షగా 2.50 లక్షలు జరిమానా విధించింది. అంతే కాదు పిటిషనర్‌ డీకే అరుణకు కోర్టు ఖర్చుల నిమిత్తం 50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్‌ రెడ్డి తరువాత అత్యధిక ఓట్లు సాధించిన డీకే అరుణను 2018 డిసెంబరు 12 నుంచి ఎమ్మెల్యేగా  ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున డీకే అరుణ పోటీ చేయగా, కృష్ణమోహన్‌ రెడ్డికి 1,00,057 ఓట్లు, డీకే అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. ప్రసుత్తం డీకే అరుణ బీజేపీ పార్టీలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లేఖపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈసీ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే తాను మరోసారి అసెంబ్లీ సెక్రెటరీ కలుస్తానని డీకే అరుణ చెప్పారు.