Newspillar
Newspillar
Sunday, 17 Sep 2023 00:00 am
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కీలక వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి (Vijayabheri) సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సభలో మాట్లాడిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి వేర్వేరుగా ఒక్కో హామీని ఇచ్చారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు ఈ 6 గ్యారంటీలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

బీఆరెస్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వసం జరిగింది.. అందుకే తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చడానికి సోనియా గాంధీ ఈ గడ్డపై కాలు మోపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ రాకతో తెలంగాణ నేల పులకరించిందన్నారు. విజయభేరి సభ నిర్వహించకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు పన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. విజయభేరి సభ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నించాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. సభ కోసం పరేడ్ గ్రౌండ్ కు అనుమతి అడిగితే కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. గచ్చిబౌలి స్టేడియం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తుక్కుగూడలో సభ జరుపుకుందామంటే దేవదాయ భూమి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినా ఇక్కడి రైతులు ముందుకొచ్చి ఈ సభకు భూమి ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. మీరంతా లక్షలాదిగా తరలివచ్చి  విజయభేరిని విజయవంతం చేశారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. కానీ వచ్చిన తెలంగాణలో రైతులు, యువత ఇలా ప్రతి ఒక్కరిని కేసీఆర్ మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విజయభేరి సభలో విడుదల చేసిన గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెెంటనే అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆరు గ్యారెంటీలు
1. మహాలక్ష్మీ (Maha Lakshmi)
a. మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సహాయం అందజేత
b. రూ. 500 కేగ్యాస్ సిలిండర్ అందజేత
c. మహిళలకు రాష్టమంతట టీఎస్ఆర్టీసీబస్సుల్లో ఉచిత పయ్రాణం

2. రైతు భరోసా (Raithu Bharosa)
a. ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15,000, వ్యవసాయకూలీలకు రూ.12,000 అందజేత
b. వరిపంటకు రూ. 500 బోనస్.

3. గృహ జ్యోతి (Gruha Jyothi)
a. అన్ని కుటుంబాలకు 200యూనిట్లఉచిత విద్యుత్తు సౌకర్య కల్పన

4. ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu)
a. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటిస్థలం,రూ. 5 లక్షల ఆర్థిక సాయం.
b. అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చ. గజాల ఇంటిస్థలం అందజేత.

5.యువ వికాసం (Yuva Vikasam)
a. విద్య భరోసా కార్డు - రూ. 5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీరహిత విద్యార్థిఆర్ధిక సహాయక కార్డుఅందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ పయ్రాణ ఖర్చులు,ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీమెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు , స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మరియు ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయకల్పన.
b. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు.

6. చేయూత (Cheyutha)
a. ప్రతి నెలా రూ.4,000 చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత.
b. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు