Newspillar
Newspillar
Wednesday, 18 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

ములుగు రిపోర్ట్- కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) తెలంగాణలో పర్యటించారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయంలో (Ramapap Temple) రామలింగేశ్వరుడిని వీరిద్దరు దర్శించుకున్నారు. వెంకటాపూర్‌ మండలం రామాంజాపూర్‌లో బుధవారం నిర్వహించిన విజయభేరి సభకు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ చేరుకున్న రాహూల్, ప్రియాంకలు, 4.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ లో రామప్పకు చేరుకున్నారు. 

రామప్ప ఆలయంలో రామలింగేశ్వరుడి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ నేతలతో కలిసి గుడి చుట్టూ తిరుగుతూ కళాఖండాలను నిశితంగా పరిశీలించారు. సప్తస్వరాల పొన్న చెట్టు, ముగ్గురు మనుషుల నాలుగు కాళ్ల శిల్పం, హైహీల్స్‌ చెప్పులు, నాట్య మండపం, అష్టదిక్పాలకులు, ఆలయ ద్వారాలకు ఇరువైపులా ఉన్న దిక్కులు చూపించే ఏనుగు బొమ్మలను చూసి రాహూల్, ప్రియాంకలు ఆశ్చర్యపడ్డారు.

ఇక రామప్ప ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుడి విగ్రహాన్ని చూసి తన్వయత్వానికి లోనయ్యారు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలు. రాహుల్‌ తన వెంట వచ్చిన ఫొటోగ్రాఫర్‌ను పిలిచి ప్రత్యేకంగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నారు. అంతే కాదు తన మొబైల్ ఫోన్‌ తో సోనియాగాంధీకి వీడియోకాల్‌ చేసి, నందీశ్వరుడి విగ్రహాన్ని ఆమెకు చూపించారు. రామప్ప ఆలయాన్ని ఎన్నేళ్ల పాటు నిర్మించారు, నిర్మాణంలో ఎంతమంది పనిచేశారు, ఎలాంటి రాళ్లు ఉపయోగించారు వంటి విషయాలను గైడ్‌ను అడిగి ఆసక్తిగా తెలుసుకున్నారు రాహూల్, ప్రియాంకలు.