Newspillar
Newspillar
Thursday, 11 Apr 2024 18:30 pm
Newspillar

Newspillar

బాపట్ల రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఫైర్ అయ్యారు. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం మూడు రాజధానులు కడతారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఓటు వేసిన వారినే కాటేసే రకం జగన్‌ అని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా నష్టపోయింది ఎస్సీలేనన్న చంద్రబాబు.. దళితుల కోసం పెట్టిన 25 కార్యక్రమాలను రద్దు చేసి, వారిని అన్ని రకాలుగా మోసం చేశారని ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారని చంద్రబాబు ఆవేధన వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి పూర్తయితే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ వినియోగం పెరిగిందన్న చంద్రబాబు.. నాసిరకం మద్యం తాగి అనేక మంది ప్రాణాలు పోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయని.. వైసీపీ అరాచకాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని అన్నారు చంద్రబాబు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.