Newspillar
Newspillar
Thursday, 18 Apr 2024 18:30 pm
Newspillar

Newspillar

అమరావతి రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (CM Jagan) విజయవాడలో మేమంతా సిద్దం రోడ్‌షో నిర్వహిస్తుండగా రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అజిత్‌ సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌ కుమార్‌ (Satish Kumra) అలియాస్‌ సత్తిని ఈ కేసులో 1గా చేర్చారు పోలీసులు. మూడు రోడుల విచారణ తరువాత గురువారం మధ్యాహ్నం విజయవాడలోని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జడ్జ్ రమణారెడ్డి ఎదుట నిందితుడు సతీశ్ కుమార్ ను హాజరుపర్చారు.

విజయవాడ శివారు సింగ్‌ నగర్‌ డాబాకొట్ల రోడ్డులో ఈ నెల 13 రాత్రి మేమంతా సిద్ధం రోడ్‌షో సాగుతుండగా రాయి విసిరిన ఘటనలో ముఖ్యమంత్రి జగన్‌ నుదుటి మీద గాయమైంది. సీఎం పక్కనే ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు అదే రాయి తగిలి కంటికి చిన్న గాయమైంది. ఘటనపై వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు సింగ్‌ నగర్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 120 (బి), సెక్షన్‌ 307 ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

ఈమేరకు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరిపిన పోలీసులు మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న సతీశ్ కుమార్ అలియాస్ సత్తి ముఖ్యమంత్రిపైకి రాయి విసిరినట్లు తేల్చారు. 13 తేదీ రాత్రి సరిగ్గా 8.04 గంటలకు మేమంతా సిద్దం రోడ్‌షో డాబా కొట్ల రోడ్డులోని వివేకానంద స్కూల్ దగ్గరకు వచ్చిన సమయంలో సతీష్‌ కుమార్ తన జేబులో నుంచి పదునైన కాంక్రీట్‌ రాయిని తీసి ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసుకుని విసిరినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టులో వాదనలు విన్న తరువాత నిందితుడు సతిష్ కుమార్ కు 14 రోజుల రిమాండ్‌ విధించారు జడ్జ్. దీంతో సతీశ్ ను నెల్లూరు జైలుకు తరలించారు.