Chandrababu Naidu Case

సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

ఢిల్లీ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసును (AP Skill Development Case) కొట్టేయాలని కోరుతూ ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పై తీర్పును రిజర్వ్‌ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ లతో కూడిన బెంచ్ ఎదుట మంగళవారం చంద్రబాబు పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సీనియర్‌ అడ్వకేట్ హరీష్ సాల్వే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్‌ అడ్వకేట్ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. 

సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే (Harish Salve) చంద్రబాబు తరఫున వర్చువల్‌ గా వాదనలు వినిపించారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ప్రస్తావిస్తూ బెంచ్ ముందు వాదనలు వినిపించారు. 2019 నాటి  శాంతి కండక్టర్స్‌ కేసు, 1964 నాటి రతన్‌ లాల్‌ కేసును ఉదహరించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందన్న సాల్వే.. రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉందని చెప్పారు. సెక్షన్‌ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందన్న సాల్వే.. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదని వాదించారు. రిమాండ్‌ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయని.. విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోందని.. ముందు ఈ కేసుకు సంబందించిన ఎఫ్ఐఆర్‌ లో చంద్రబాబు పేరులేదని.. రిమాండ్‌ సమయంలో ఆయన పేరు చేర్చారని బెంచ్ ముందు వాదించారు హరీష్ సాల్వే.

ఈ కేసులో న్యాయ సమీక్ష జరిగితే కేసు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి వస్తుందన్న సాల్వే.. జీఎస్టీ చెల్లింపుల విషయాలను ప్రభుత్వానికి ముడిపెడుతుని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దేన్ని దేనితో ముడిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందన్న సాల్వే.. 2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకుతున్నారని వాదించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుందన్న సాల్వే.. 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారని చెప్పారు. కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోర్టుకు విన్నవించారు. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సాల్వే విజ్ఞప్తి చేశారు. హరీష్ సాల్వే విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు బెంచ్ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో తీర్పును రిజర్వ్‌ చేసింది.


ఇక ఈ కేసులో 17ఏ సెక్షన్‌ వర్తించదని ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహిత్గి (Mukul Rohatgi) చెప్పారు. ఈ సెక్షన్‌ అవినీతిపరులకు రక్షణ కవచం కాకూడదన్న ముకుల్.. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారని వాదించారు. ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవేనని రోహత్గీ బెంచ్ ముందు వాదించారు. ఐతే కేవలం ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా అని జస్టిస్‌ త్రివేది ఈ సందర్బంగా ప్రశ్నించారు. అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణించండి.. లేదంటే క్వాష్‌ చేయండి అని ముకుల్‌ రోహత్గీ ధర్మాసనానికి విన్నవించాపు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది 17ఏ వర్తిస్తుందా.. లేదా.. అనేదే కదా.. అని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ మళ్లీ ప్రశ్నించడంతో పాటు, కేసుల నమోదు, ఛార్జిషీట్‌, విచారణ.. అన్ని కేసుల్లోనూ జరిగేదే కదా అని వ్యాఖ్యానించారు. అందుకు ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయపరిధి ఉంటుందని అన్నారు. 


Comment As:

Comment (0)