Yanam Mounika

ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై క్షణికావేశంతో ఆత్మహత్య

ప్రియుడి మరణం తట్టుకోలేక.. తనువు చాలించిన ప్రియురాలు

క్రైం రిపోర్ట్- ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు గంజాయికి బానిసై క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటనతో యానాంలో విషాద ఛాయలు అలముకున్నాయి. యానాం (Yanam) లోని యూకేవీ నగర్‌కి చెందిన మీసాల మౌనిక (22) (Meesala Mounika) తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. ఆమెకు అక్క, చెల్లి ఉన్నారు. సమీపంలోని తాళ్లరేవు మండలం చొల్లంగి లోని రాయల్‌ కాలేజీలో నర్సింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది మౌనిక. ఈమె అక్క, చెల్లెలు పెళ్లళ్లి చేసుకుని వారి వారి అత్తారింట్లో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటోంది. ఈ క్రమంలో కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాను (Chinna) ప్రేమించింది. సుమారు రెండేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతోంది.

ఐతే గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం తన సోదరుడిని 500 రూపాయలు అడిగితే ఇవ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తరువాత కాకినాడలోని హాస్పిటల్ లో చికిత్సపొందుతూ చనిపోయాడు. ప్రియుడు చిన్నా మరణించినప్పటి నుంచి మౌనిక కాలేజ్ కు వెళ్లడం మానేసింది. చిన్నా ఫోటోలు ఇంట్లో పెట్టుకుని. అతనికి సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని మౌనిక మానసిక కుంగుబాటుతో ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటూవస్తోంది. సోమవారం ఎవరులేని సమయంలో ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మౌనిక మేనమామ త్రిమూర్తులు ఫిర్యాదు చేయగా మౌనిక మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు పోలీసులు. మౌనిక మృతితో యానాంలో విషాదం నెలకొంది.


Comment As:

Comment (0)