Newspillar
Newspillar
Thursday, 29 Jun 2023 18:30 pm
Newspillar

Newspillar

షామీర్ పేట్- హుజూరాబాద్‌ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కు మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని ఇటీవల మీడియా సమావేశంలో ఈటలతో పాటు ఆయన భార్య జమున ఆరోపించిన నేపధ్యంలో.. కేటీఆర్ స్పందించారు. ఈటలకు ప్రాణ హాని ఉంటే సమీక్షించి భద్రతను పెంచాలని డీజీపిని ఆదేశించారు మంత్రి కేటీఆర్. 

ఇంకేముంది కేటీఆర్ ఆదేశాలతో మేడ్చల్‌ డీసీపీ సందీప్‌ రావు ఈటలను కలిసి వివరాలు సేకరించారు. ప్రాణహానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న డీసీపీ సందీప్‌.. డీజీపీకి సీల్డు కవర్‌ లో నివేదిక సమర్పించారు. ఈటల రాజేందర్ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది.  

ఈమేరకు శుక్రవారం రాత్రి అందుకు సంబందించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈటల రాజేందర్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మొత్తం 16 మందితో భద్రత కల్పించనున్నారు. ఐదుగురు అంగరక్షకులు ఎప్పుడూ ఈటల రాజేందర్ వెంట ఉంటారు. మరో ఆరుగురు అంతర్గత భద్రతా సిబ్బందిలో షిఫ్ట్ కు ఇద్దరు చొప్పున.. మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు. ఈమేరకు డీజీపీ ఆదేశాలు జారి చేయడంతో పాటు వెంటనే భద్రతను ఏర్పాటు చేశారు.