Newspillar
Newspillar
Thursday, 06 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

ఆస్ట్రేలియా- మెల్‌బోర్న్‌ లో ఓ భారతీయ విద్యార్థినిని ఆమె మాజీ ప్రియుడు అతి దారుణంగా హత్య చేశాడు. కొంత కాలంగా తనను దూరం పెట్టిందని ఆమెపై కక్ష పెంచుకున్న అతడు.. ఆమెను కిడ్నాప్ చేసి, కళ్లకు గంతలు కట్టి, కేబుళ్లతో శరీరాన్ని చుట్టేసి, సజీవంగా పాతిపెట్టాడు. దీంతో ఆమె చాలా సేపు నరకయాతన అనుభవించి చనిపోయింది. రెండేళ్ల క్రితం 2021లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి దర్యాప్తులో వెల్లడైన వివరాలను ప్రాసిక్యూటర్‌ బుధవారం కోర్టుకు వివరించారు. 

భారత్ లోని పంజాబ్‌ కు చెందిన జాస్మిన్‌ కౌర్‌ (Jasmin Kour) (21) నర్సింగ్‌ కోర్సు కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ ఆమెకు తారిక్‌ జోత్‌ సింగ్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. కొంతకాలం తర్వాత తారిక్‌ జోత్‌ ప్రవర్తనలో మార్పును గమనించిన జాస్మిన్‌, అతడిని దూరంపెట్టింది. దీంతో అతడు జాస్మిన్‌ పై కక్ష్య పెంచుకున్నాడు. ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని పధకం పన్నాడు. 

2021 మార్చి 5న జాస్మిన్ కౌర్ ను నార్త్‌ పాలింప్టన్‌ ప్రాంతం నుంచి కిడ్నాప్ చేశాడు. ఆమె కళ్లకు గంతలు కట్టి, కేబుళ్లతో కట్టేసి, కారు డిక్కీలో కుక్కి 640 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఫ్లిండర్స్‌ రేంజెస్‌ కు తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో ఆమె గొంతుకు గాయం చేసి ప్రాణం ఉండగానే గోతిలో పాతిపెట్టాడు. జాస్మిన్‌ పాతిపెట్టిన ప్రదేశం నుంచి మృతదేహాన్ని వెలికి తీయగా.. పోస్ట్‌మార్టం నివేదికలో అతడు చంపిన తీరు బయటకువచ్చింది. ఈ కేసులో అతడికి కోర్టు జీవితఖైదు విధించే అవకాశం ఉంది. సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు జాస్మిన్‌ కౌర్ ను హత్య చేసింది తారిక్ జోత్ సింగ్ అని నిర్ధారణకు వచ్చారు. అంతే కాదు ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టులో అతడు తన తప్పును అంగీకరించాడు.