Newspillar
Newspillar
Saturday, 08 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్- తెలంగాణ బీజేపీ నేత ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆపార్టీలో దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ (PM Modi) వరంగల్ (Warangal) పర్యటనలో చేసిన వ్యాఖ్యాలను మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఏ.చంద్రశేఖర్ (Chandrasekhar) తప్పుపట్టడం ఆసక్తికరంగా మారింది. అవినీతి గురించి మాట్లాడటం కాదు, చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రజలు అడుగుతున్నారని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ( (KCR) ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటేనే బీజేపీని ప్రజలు నమ్ముతారని ఆయన అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో అందర్నీ అరెస్ట్ చేసి, ఒకరిద్దరిని ఎందుకు వదిలేశారని చంద్రశేఖర్ నిలదీశారు.

బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంలో పార్టీ అధిష్టానం తప్పుచేసిందని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర వలనే బీఆర్ఎస్‌ (BRS)కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ (BJP) ఎదిగిందన్న ఆయన.. బీజేపీ అధికారంలోకి వస్తుందన్న చర్చ ప్రజల్లో జరగటానికి కారణం కూడా బండి సంజయ్ అని చెప్పారు. నియోజకవర్గంలో 2 వేలు ఉన్న బీజేపీ ఓట్లను బండి‌ సంజయ్ 40 వేలకు తీసుకెళ్ళారని.. గతంలో ఏ అధ్యక్షుడు చేయని విధంగా బండి సంజయ్ పార్టీని బలోపేతం చేస్తే.. ఎన్నికల ముందు ఆయనను తప్పించటం ఏంటని చంద్రశేఖర్ ప్రశ్నించారు. 

ఇక ఈటల రాజేందర్‌ (Etala Rajendar)కు ఇచ్చిన నామ్ కే వాస్తే పదవితో ఉపయోగం లేదన్న చంద్రశేఖర్.. లేని పదవిని సృష్టించి ఈటలకు పదవిని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజీపీ అధిష్టానాన్ని నిలదీశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ని డిమోషన్ చేసి, ఆయనకు ఇష్టం లేని పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు వలన ఈటల సహా పార్టీలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు చంద్రశేఖర్. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా పనిచేసిన తనకు ప్రధాని మోదీ సభకు పాస్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిపైనా, పార్టీపైన చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. చంద్రశేఖర్ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.