Newspillar
Newspillar
Saturday, 15 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ పొలిటికల్ రిపోర్ట్- మహారాష్ట్ర (Maharashtra) లోని ఎన్సీపీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఎన్సీపీ నుంచి తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ (Ajit pawar) సహా పలువురు నేతలు ఈరోజు ముంబయిలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad pawar) ను కలిశారు. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన తర్వాత తొలిసారి శరద్ పవార్ ను కలవడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిరేపుతోంది.

జులై 2న ఎన్సీపీ (NCP) నుంచి ఓ గ్రూపుగా  చీలిపోయిన అజిత్‌ పవార్‌ ఆ తర్వాత బీజేపీ - శిందే సారథ్యంలోని మహారాష్ట్ర సర్కార్‌ లో భాగస్వాములయ్యారు. దీంతో వెంటనే డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌, మంత్రులుగా పలువురు నేతలు ప్రమాణస్వీకారం చేయడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఇక ఈ క్రమంలో శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది. అయితే, శరద్‌ పవార్‌ అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయనే తమ అధినేత అంటూ అజిత్‌ వర్గం నేతలు చెబుతూ వచ్చారు. తమనే అసలైన ఎన్సీపీగా గుర్తించాలంటూ అజిత్‌ వర్గం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ సైతం రాసింది.

ఈ పరిణామాల క్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తో పాటు ఆయన వర్గం నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన హసన్‌ ముష్రిఫ్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, అదితి ఠాక్రే, దిలీప్‌ వాల్సే పాటిల్‌ తదితరులు శరద్‌ పవార్‌ను వైబీ చవాన్‌ సెంటర్‌లో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. శరద్‌ పవార్‌ ఆశీస్సుల కోసమే వచ్చినట్టు తెలిపిన అజిత్ పవార్, ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్‌ ను కోరినట్టు తెలిపారు. శరద్ పవార్ ను కలిసిన వారిలో మహారాష్ట్ర  డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్ తో పాటు ప్రఫుల్‌ పటేల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ పాటిల్‌ తదితరులు ఉన్నారు.