Newspillar
Newspillar
Tuesday, 25 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పోర్ట్స్ రిపోర్ట్- హైదరాబాద్ (Hyderabad), విశాఖపట్నం (Vishakapatnam) క్రికెట్ అభిమానులకు తీపి కబురు చెప్పింది బీసీసీఐ (BCCI). భారత క్రికెట్‌ జట్టు (Team India) సెప్టెంబరు నుంచి ఆరు నెలల వ్యవధిలో సొంతగడ్డపై ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ ల షెడ్యూల్‌ను విడుదల చేసింది బీసీసీఐ. భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) లో ప్రాధాన్యం దక్కని నగరాలకు పెద్ద పీట వేస్తూ మ్యాచ్‌ లను ఖరారు చేసింది. ప్రపంచకప్‌ ఆతిథ్య అవకాశమే దక్కని విశాఖపట్నం, ఆ టోర్నీలో భారత్‌ మ్యాచ్‌ దక్కించుకోలేకపోయిన హైదరాబాద్‌ కు రెండేసి మ్యాచ్‌ లను బీసీసీఐ కేటాయించింది.

అక్టోబరులో ప్రపంచకప్‌ ప్రారంభం అవనుండగా, దానికి ముందు ఆడే టీమ్‌ ఇండియా చివరి వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాతో పోడీ పడబోతోంది. సెప్టెంబరు 22, 24, 27 తేదీల్లో జరిగే ఈ మ్యాచ్‌ లకు మొహాలి, ఇందౌర్‌, రాజ్‌కోట్‌  ఆతిథ్యమిస్తాయి. ప్రపంచకప్‌ ముగిశాక ఆసీస్‌ తోనే భారత జట్టు అయిదు టీ20ల సిరీస్‌ ఆడుతుంది. నవంబరు 23న తొలి మ్యాచ్‌ కు విశాఖపట్నం, డిసెంబరు 3న చివరి టీ20 కి హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనున్నాయి. నవంబరు 26, 28, డిసెంబరు 1 తేదీల్లో మిగతా టీ20లు త్రివేండ్రమ్, గువాహటి, నాగ్‌పుర్‌ లలో జరుగుతాయి.

ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌ తో జనవరి 11, 14, 17 తేదీల్లో భారత్‌ ఆడే మూడు టీ20ల సిరీస్‌ కు మొహాలి, ఇందౌర్‌, బెంగళూరు ఆతిథ్యమిస్తాయి. అదే నెల చివర్లో ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ ప్రారంభమవుతాయి. జనవరి 25 నుంచి 29 తేదీల్లో తొలి టెస్టు హైదరాబాద్‌లో, ఫిబ్రవరి 2  నుంచి 6 మధ్య రెండో టెస్టు విశాఖలో జరుగుతాయి. తర్వాతి మూడు టెస్టులకు రాజ్‌కోట్‌, రాంచి, ధర్మశాల వేదికలుగా ఖరారు చేసింది బీసీసీఐ. మరి ఆయా తేదీల్లో వైజాగ్, హైదరాబాద్ క్రికెట్ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష్యంగా చూసేందుకు సిద్దమవ్వండి.