Newspillar
Newspillar
Tuesday, 08 Aug 2023 00:00 am
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నటించిన తాజా సినిమా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సినిమా థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సంబరాలు జరుపుకుంది. వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో పాల్గొన్నా చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా తెలుగు సినీమా ఇండస్ట్రీని చుట్టుముడుతున్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి కామెంట్ చేశారు. మీలాంటి వాళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి.. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు.. అంతేగానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి.. అని ఏపీ రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ అన్నారు చిరంజీవి. 

ఇక పరోక్షంగా తమపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మంత్రులు పేర్ని నాని (Perni Nani), అమర్నాధ్ (Gudiwada Amarnath) తప్పుబట్టారు. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్రను పెట్టి హేళన చేయడాన్ని వారు విమర్శించారు. మీరు గిల్లితే ఎదుటివారూ గిల్లుతారు. అది చూడలేకపోతున్నానని బాధపడితే కుదరదని చిరంజీవిని ఉద్దేశిస్తూ అన్నారు. వ్యక్తిగతంగా తాను చిరంజీవిగారి అభిమానినని చెప్పిన పేర్ని నాని.. ఆయన తన హీరో అని.. చదువుకునే రోజుల్లో ఆయన సినిమా విడుదలైతే దండలు వేసిన సందర్భాలూ ఉన్నాయని అన్నారు. కానీ హైదరాబాద్‌ ఫిలింనగర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి ఎంత దూరమో.. ఇక్కడి నుంచి అక్కడికీ అంతే దూరమని కామెంట్ చేశారు. సినిమాలు, రాజకీయాలు రెండూ వేర్వేరని.. చిరంజీవి, రామ్‌చరణ్‌, జూ ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రవితేజ, మహేశ్‌బాబు, ఇతర నటీనటులపై ఏ రాజకీయ పార్టీ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

కానీ, సంక్రాంతికి డ్యాన్స్‌ వేసిన ఒక రాజకీయ నాయకుడిని అవమాన పరిచేలా సినిమాలో సన్నివేశం పెట్టి, అసలు కథకు సంబంధం లేని విషయాన్ని ఒక నటుడి పాత్ర ప్రవేశపెట్టి, కక్ష తీర్చుకోవాలనుకున్నప్పుడు అన్నీ పరిణామాలను ఎదుర్కోక తప్పదని పేర్ని నాని చెప్పారు. ఇక చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని.. సినిమాల్లోకి రాజకీయాలను లాగొద్దని అన్నట్లు తనకు తెలిసిందని మంత్రి అమర్నాధ్ అన్నారు. అది మాకంటే ముందు ఆ మురికి  మాటలు మాట్లాడిన వారి తమ్ముడికి చెప్పి ఉంటే బాగుండేదని హితువుపలికారు. ఒక రాష్ట్ర మంత్రి అయిన అంబటి రాంబాబు (Ambati Rambabu) పాత్ర పెట్టి, హేళన చేశారని, పైగా అది మంత్రి పాత్రేనని ఆ సినిమాలో నటించిన ఎవరికీ చెప్పే ధైర్యం లేదని అమర్నాధ్ అన్నారు.