Newspillar
Newspillar
Friday, 11 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- వైన్ షాపుల (Wine Shops) టెండర్లకు తెలంగాణలో భారీ స్పందన వస్తోంది. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు భారీగా పోటీ పడుతున్నారు. వైన్ షాపులకు దరఖాస్తులను ఆహ్వానించిన మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రెండు వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలకు గిరాకీ మామూలుగా ఉండదు. దీంతో ఈసారి వైన్ షాపులను దక్కించుకుంటే ఇక కాసుల వర్షమే అని చాలా మంది భావిస్తున్నారు. దీంతో మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు పొటెత్తాయి.

మరీ ముఖ్యంగా రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల నుంచి భారీ స్పందన వస్తోంది. తెలంగాణలో మొత్తం 2 వేల 620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఈ నెల 4 నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు, దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్‌ జిల్లాల్లో రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

ఇక మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 వరకు గడువు ఉంది. 18 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన మొత్తం దరఖాస్తుల నుంచి, ఆగస్టు 21న లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల లైసెన్సులు కేటాయించనున్నారు. క్రితం సారి వైన్ షాపుల నోటిఫికేషన్‌లో నాన్ రీఫండెబుల్ అప్లికేషన్ ఫీజు కింద తెలంగాణ ప్రభుత్వానికి 1,350 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అంతకు మించి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. (Telangana Wine Shop Tenders)