Newspillar
Newspillar
Tuesday, 15 Aug 2023 00:00 am
Newspillar

Newspillar

వైజాగ్ రిపోర్ట్- ప్రపంచంలోని టాప్‌ పది మంది ధనవంతుల్లో ఐదుగురు జ్యూయిష్‌లు ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చెప్పారు. తెలుగు జాతి కూడా అంత గొప్పస్థాయికి ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన అన్నారు. విశాఖపట్నంలోని (Vizag) ఎంజీఎం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇండియా విజన్‌ 2047 (India Vision 2047) డాక్యుమెంట్‌ ను చంద్రబాబు ఆవిష్కరించారు. భవిష్యత్తుపై ప్రణాళిక ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమని ఈ సందర్బంగా ఆయన అన్నారు. రాబోయే వందేళ్ల సమయం నేటి చిన్నారులు, విద్యార్థులదేనన్న చంద్రబాబు, దేశాభివృద్ధిలో తెలుగుజాతి ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పారు.

2047లో వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటామని చెప్పిన చంద్రబాబు.. భవిష్యత్తు ప్రణాళిక లేకుంటే వ్యక్తిత్వ వికాసం కష్టమని అన్నారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులకు విజన్‌ ఉండాలని.. విజన్‌ ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఉన్నత స్థానాలకు వెళ్తారని చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారని, మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని అంతా కోరుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇక రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ సిటీ విశాఖపట్నం అని చంద్రబాబు చెప్పారు. తనకు నచ్చింది, తనను ఎప్పుడూ అభిమానించేది విశాఖ నగరమని అన్నారు.

తన దూరదృష్టి వల్లే నేడు హైదరాబాద్‌లో ఎక్కువ తలసరి ఆదాయం వస్తోందన్న చంద్రబాబు, విభజన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌ 2029 కి పిలుపునిచ్చామని గుర్తుచేశారు. విజన్‌ 2047 డాక్యుమెంట్ (Vision 2047 Document) డ్రాఫ్ట్‌ మాత్రమేనని చెప్పి చంద్రబాబు.. దీనిపై మేధావులు చర్చించాల్సి ఉందని అన్నారు. సౌర, పవన, పంప్డ్‌ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలని, కాలుష్యం లేని విద్యుత్‌ ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పేదరికం లేని సమాజం తేవాలన్న చంద్రబాబు, 2047 లోగా సంక్షేమం, అభివృద్ధి, సాధికారత రావాలని ఆకాంక్షించారు.