Newspillar
Newspillar
Monday, 04 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

తిరుమల రిపోర్ట్- తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanams) యువతీ యువకులకు శుభవార్త చెప్పింది. ఇకపై కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మరింత సలభంగా చేసుకునే వెసులుబాటు కల్పించింది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తికి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. చిన్నతనం నుంచే యువతలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు 25 సంవత్సరాల లోపు వయస్సున్న యువత కోటి గోవింద నామాలు రాస్తే, వారి కుటుంబానికి ఒకసారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ (TTD) ఛైర్మన్‌ కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.

ఈ నేపధ్యంలో 25 యేళ్ల లోపు యువకుడు లేదా యువతి 10,01,116 గోవిందనామాలు రాస్తే ఆ వ్యక్తితో పాటు వారి కుటుంబానికి స్వామివారి బ్రేక్‌ దర్శనం కల్పించేవిధంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇక ఈ సారి అధికమాసం రావడంతో సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు పెరటాసి మాసం వల్ల రద్దీతో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని ఆయన చెప్పారు. ఈ నెల 18న ధ్వజారోహణం సందర్భంగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.

తిరుపతిలో శిథిలావస్థకు చేరుకున్న 2, 3 గోవిందరాజుల సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఒక్కో సత్రానికి 300 కోట్ల  రూపాయల అంచనా వ్యయం కాగా, 20 వేల మందికి వసతి కల్పించనున్నారు. ముంబయిలోని బాంద్రాలో 1.65 కోట్లతో శ్రీవారి రెండో ఆలయంతో పాటు 5.35 కోట్లతో సమాచార కేంద్ర నిర్మాణం చేయాని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆలయాల్లో అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు, ప్రసాద పంపిణీదారులుగా 413 కొత్త పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు 20 పేజీలున్న కోటి భగవద్గీత పుస్తకాలు శ్రీవారి ప్రసాదంగా ఉచితంగా పంపిణీ చేయాలని టీటీడీ బోర్డ్ సమావేశంలో నిర్ణయించారు.