Newspillar
Newspillar
Thursday, 14 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్- చంద్రుడి (Moon) పైకి పరోక్షంగా భూమి నుంచే నీరు చేరిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. జాబిల్లిపై నీటి జాడలున్నట్లు (Water Fornation) భారత్‌ సహా పలు దేశాలు జరిపిన ప్రయోగాల్లో ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ఐతే అవి ఎలా ఏర్పడ్డాయన్న దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అసలు వాతావరణం లేని చంద్రుడి ఉపరితలంపై నీటి ఆనవాళ్ల రహస్యాల గురించి ఇప్పటివరకు చాలా అధ్యయనాలు జరిగాయి. ఈ క్రమంలో చందమామపై నీటి ఆనవాళ్లకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులేకి వచ్చింది. భూవాతావరణంలోని ఎలక్ట్రాన్స్‌ (Electrons) కారణంగానే చందమామపై నీరు ఏర్పడిందని యూనివర్సిటీ ఆఫ్‌ హవాయి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‌ (India) ప్రయోగించిన చంద్రయాన్‌-1 (Chandrayaan-1) మిషన్‌ సేకరించిన డేటా ఆధారంగానే ఈ విషయాన్ని కనుగొన్నట్లు సైంటిస్తులు చెప్పారు.

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం - ఇస్రో (ISRO) 2008 అక్టోబరులో ప్రయోగించిన చంద్రయాన్‌-1 మిషన్‌ లోని ఇమేజింగ్‌ స్పెక్ట్రోమీటర్‌ అయిన మూన్‌ మినరాలజీ మ్యాపర్‌ పరికరం సేకరించిన రిమోట్‌ సెన్సింగ్‌ డేటాను అమెరికాలోని మనోవాలో గల యూనివర్సిటీ ఆఫ్‌ హవాయి శాస్త్రవేత్తల బృందం ఇటీవల అధ్యయనం చేసింది. ఈ క్రమంలో ఆ వివరాలను జర్నల్‌ నేచర్‌ ఆస్ట్రానమీలో ప్రచురించింది. భూ వాతావరణంలో ఉండే ఎలక్ట్రాన్స్‌, చందమామపై నీరు ఏర్పడటానికి కారణమై ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్‌ హవాయి శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ ఎలక్ట్రాన్స్‌ చంద్రుడి ఉపరితలంపై ఉండే శిలలు, ఖనిజాలను విచ్ఛిన్నం చేయడం లేదా కరిగించడం వంటి పర్యావరణ ప్రక్రియలకు దోహదం చేసి ఉంటాయని సైంటిస్తుల బృందం స్పష్టం చేసింది.

చందమామపై నీరు జాడలకు ఇదొక్కటే కారణం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. సుమారు 350 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహశకలాలు, తోకచుక్కలు ఢీకొట్టినప్పుడు పుట్టుకొచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భూమిపై వాతావరణం నుంచి హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ అయాన్లు అంతరిక్షంలోకి వెళ్తుంటాయని, ఇవి చందమామ మీద కలిసిపోయి నీరుగా ఏర్పడి ఉండొచ్చని గతంలో కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి జాబిల్లిపై నీరుందనే విషయం మరోసారి రుజువైంది. దీంతో రానున్న రోజుల్లో చందమైమపైకి మునుషులతో కూడిన వ్యామోనైక యాత్రలు చేయవచ్చని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.