Newspillar
Newspillar
Monday, 09 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకావడంతో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 15 నుంచి వరుసగా కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నెల 15వ తేదీన ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులతో సీఎం సమావేశం కానున్నారు. ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు, ఇతర అంశాలపై వారికి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయడంతో పాటు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు బీ ఫారాలను స్వయంగా అందజేయనున్నారు. అదే రోజు అభ్యర్ధుల సమక్షంలోనే పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు కేసీఆర్.

ఆ తరువాత అదేరోజు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, హుస్నాబాద్‌ కు వెళ్లి, సాయంత్రం 4 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక్కడి నుంచి వరుసగా జిల్లా పర్యటనల్లో సీఎం పాల్గొనేలా రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఈనెల 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్న బహిరంగ సభలకు హాజరవుతారు. 17న సిద్దిపేట, సిరిసిల్లలలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

ఇక వచ్చే నెల నవంబరు 9న గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నవంబర్ 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి (Konaayapally) వేంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి గజ్వేల్‌ కు వెళ్లి నామినేషన్‌ వేస్తారు. అక్కడి నుంచి వెళ్లి మద్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్‌ ధాఖలు చేస్తారు.