Newspillar
Newspillar
Saturday, 04 Nov 2023 18:30 pm
Newspillar

Newspillar

అమరావతి రిపోర్ట్- వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai reddy) అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్బీ జేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) లేఖ రాశారు. గత పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతున్న విజయసాయి.. సీబీఐ, ఈడీ కేసుల విషయంలో షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆమె ఆరోపించారు. విజయసాయి రెడ్డిపై ఇప్పటికే 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 ఏళ్లకు పైగా బెయిల్‌పై కొనసాగుతున్నారని సుప్రీం కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు పురందేశ్వరి.

వీరిద్దరు ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా ఆలస్యం చేస్తూ నిరోధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రతి కేసులోను నిరంతరం వాయిదాలతో విచారణకు రాకుండా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన బినామీలతో రాష్ట్రంలో కొన్ని డిస్టిలరీలను నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో బయటపడిందని, ఈ అంశం వెలుగులోకి రాగానే మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రికి లేఖలు రాసినట్లు పురంధేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన లేఖను పరిశీలించి ప్రస్తావించిన అంశాల్లో జోక్యం చేసుకొని విజయసాయి రెడ్డి బెయిల్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరిన పురంధేశ్వరి.. వచ్చే 6 నెలల్లో ఈ కేసులన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.