Newspillar
Newspillar
Monday, 04 Dec 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ని ఎంపిక చేసింది. ఈ మేరకు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని తాజా పరిణామాలు, హైదరాబాద్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్‌ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ దిల్లీలో ప్రకటించారు. డిసెంబర్‌ 7న రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి (Telangana CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ఐతే కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ముందు కొంత సస్పెన్స్ కొనసాగింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో సమావేశమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిని ఎంపిక చేసే నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగిస్తూ సోమవారం ఏక వాక్య తీర్మానం చేశారు. సీఎల్పీ తీర్మానాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అధిష్ఠానానికి  అందించారు. దీనిపై మంగళవారం ఢిల్లీలో సుదీర్గంగా చర్చించిన అగ్రనేతలు రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. 

ఇక రేవంత్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి తెసుకుంటే.. 

రేవంత్ రెడ్డి పూర్తి పేరు.. అనుముల రేవంత్‌రెడ్డి (Revanth Reddy) 
నాగర్‌ కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబరు 8న జన్మించారు. 
తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. 
రేవంత్ రెడ్డి వనపర్తిలో పాలిటెక్నిక్‌ చదివారు. 
2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 
మొదటిసారి 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 
కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నప్పటికీ, కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్‌ మండలంలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందారు రేవంత్ రెడ్డి. 
2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో నుంచి గెలుపొందారు.
రేవంత్ రెడ్డి 2008లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి గెలుపొందారు.
2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్‌లో చేరారు. 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 
2019 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 
2021లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టారు.  
ఇప్పుడు డిసెంబర్ 7న తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
Telangana CM Revanth Reddy