Newspillar
Newspillar
Sunday, 07 Jan 2024 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తనతో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే నిరాకరించారన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాక్‌కు భారత మాజీ హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా రాసిన తన పుస్తకంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. 2019లో భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ను పాకిస్థాన్‌ బంధించి చిత్రహింసలకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు అప్పట్లో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ సందర్బంగా అప్పుడు నాటి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అందుకు మోదీ నిరాకరించారని తెలుస్తోంది.

భారత్‌, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలపై భారత మాజీ హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా రాసిన పుస్తకం త్వరలోనే విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 27న అభినందన్‌ వర్ధమాన్‌ ను పాకిస్థాన్ బంధించిన తర్వాత భారత్‌ తీవ్రంగా స్పందించింది. పాక్ పై మొత్తం 9 క్షిపణులతో దాడి చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పాకిస్థాన్ వణికిపోయింది. అప్పుడు భారత్‌కు అప్పటి పాక్ హైకమిషనర్‌ సోహైల్‌ మహమ్మద్‌ ఇస్లామాబాద్‌ లో ఫిబ్రవరి 27 అర్ధరాత్రి తనను సంప్రదించారని భారత మాజీ హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా తెలిపారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌.. మోదీతో ఫోన్‌ లో మాట్లాడాలనుకుంటున్నారని, అందుకు ఏర్పాటు చేయాలని కోరారట. తాను వెంటనే ఢిల్లీలోని ప్రధాని కార్యాలయ అధికారులకు సమాచారమిచ్చానని.. ఐతే ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడేందుకు ప్రధాని మోదీ అందుబాటులో లేరని అధికారులు చెప్పినట్లు పుస్తకంలో రాసుకొచ్చారు. ఆ తరువాత అభినవ్ ను బేషరతుగా పాక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.