Newspillar
Newspillar
Sunday, 14 Apr 2024 00:00 am
Newspillar

Newspillar

విజయవాడ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan) ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై స్వల్ప  గాయమైంది. శనివారం రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉండగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తి సీఎం జగన్ పైకి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌ నగర్‌లో గంగానమ్మ గుడి దగ్గర ప్రైవేటు స్కూల్‌ సమీపంలో యాత్ర సాగుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఐతే ఈ ఘచన జరిగిన సమయంలో అక్కడ విద్యుత్తు సరఫరా లేదు.

ముఖ్యమంత్రి జగన్ పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ కు సైతం రాయి తగిలి స్వల్ప గాయమైంది. ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ కు ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తరువాత బస్సు యాత్ర ప్రచారం కొనసాగించారు. కేసరపల్లిలో శనివారం రాత్రి బస్సు యాత్ర ముగిసిన తర్వాత జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి అక్కడకు వచ్చారు. ఆ తరువాత భారతీతో కలిసి సీఎం జగన్ విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స తరువాత తిరిగి కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ నుదుటికి రెండు కుట్లు పడ్డాయని చెప్పిన విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్‌.. గాయం పెద్ద తీవ్రమైనది కాదని, ప్రమాదమేమి లేదని తెలిపారు. గాయం కారణంగా ఏర్పడ్డ వాపు ఎక్కువగా ఉండటంతో రెండు మూడు రోజుల్లో జగన్ కోలుకుంటారని చెప్పారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌, సీఎం సెక్యూరిటీ గ్రూపు, క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్‌, ఎస్కార్ట్‌, ఇన్నర్‌ కార్డన్‌, అవుటర్‌ కార్డన్‌, పెరిఫెరీ ఇలా వందల మందితో సీఎం జగన్ కు భద్రత ఉంటుంది. వీళ్లు కాకుండా బస్సు యాత్రలో అదనంగా ఎక్కడికక్కడ స్థానిక పోలీసుల భద్రత ఉండగా ముఖ్యమంత్రి పైకి రాయి విసిరి, గాయం చేయగలడంపై సర్వత్రా అనుమానాాలు వ్యక్తం అవుతున్నాయి.