Newspillar
Newspillar
Saturday, 13 Apr 2024 18:30 pm
Newspillar

Newspillar

గుంటూరు రిపోర్ట్- వైసీపీ ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు కుట్ర చేస్తోందని తెలుగుదేశం పార్టీ (TDP) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆరోపించారు. ఐతే ఏం చేసినా కూటమిదే ఘన విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కుంచనపల్లి వద్ద ఉన్న అపార్ట్‌మెంట్‌ వాసులతో సమావేశమైన లోకేశ్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఐదేళ్ళ వైసీపీ అరాచక పాలనలో నరకం చూసిన ప్రజలు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్బంగా ఆయన అన్నారు.

ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద అలజడి సృష్టించి పోలింగ్‌ ఆలస్యం అయ్యేలా చేసేందుకు కుట్ర జరుగుతోందని, ఇలాంటి కుట్రలను ప్రజలు గమనించి ఓపికతో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని లోకేశ్ కోరారు. అప్పులు చేసి భారాన్ని పన్నుల రూపంలో ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కియా, హెచ్‌సీఎల్‌ వంటి పరిశ్రమలు రప్పించడంతో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని లోకేశ్ చెప్పారు.

కానీ జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని లోకేశ్ విమర్శించారు. విశాఖపట్నంలో 500 కోట్లతో నిబంధనలకు విరుద్ధంగా జగన్‌ విలాసవంతమైన ప్యాలెస్‌ నిర్మించుకున్నారని మండిపడ్డారు. నిర్మాణానికి అనుమతులు లేని కారణంగా కేంద్రం 200 కోట్లు జరిమానా విధించిందని చెప్పిన లోకేశ్.. డబ్బుతో మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లులేని నిరుపేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చన్నారు.

తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న వనరుల ఆధారంగా పలు రకాల పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని లోకేశ్ చెప్పారు. విశాఖపట్నంలో ఐటీ, శ్రీకాకుళంలో ఫార్మా, గోదావరి జిల్లాల్లో ఆక్వా, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్‌, అనంతపురంలో ఆటోమొబైల్స్‌, డిఫెన్స్‌ పరికరాల పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఐదేళ్లలో సుమారు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీని ద్వారా రాష్ట్రంలో రెండున్నర రెట్ల సంపద పెరుగుతుందని లోకేశ్ తెలిపారు.