Amazon

ఆమెజాన్ అడవిలో 40 రోజుల క్రితం తప్పిపోయిన నలుగురు పిల్లలు

అమెజాన్ అడవిలో అద్భుతం.. విమానం కూలిన 40 రోజులకు సజీవంగా పిల్లలు

ఇంటర్నేషనల్ డెస్క్- దక్షిణ అమెరికాలోని కొలంబియాలో అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన, దట్టమైన అమెజాన్‌ అడవులు ఈ అధ్బుతానికి వేదిక అయ్యాయి. ప్రమాదకరమైన క్రూరమృగాలు, సర్పాలు, జంతువులు సంచరించే ఆమెజాన్ అడవిలో 40 రోజుల క్రితం తప్పిపోయిన నలుగురు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. అవును వినడానికి ఇది కొంచెం ఆశ్చర్యమే అన్పించినా ఇది నిజంగా జరిగింది.

అమెరికాలోనే అతి భయంకరమైన అమెజాన్ అటవీ ప్రాంత (Amazon rainforest) పరిధిలోని అరారాక్యూరా నుంచి శాన్‌జోస్‌ డెల్‌ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటవ తేదీన ఓ విమానం బయలుదేరింది. ఈ విమానంలో నలుగురు పిల్లలు, వారి తల్లి, గైడ్‌, పైలట్‌ ఉన్నారు. ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ తరువాత కొదిదసేపటికి ఆ విమానం రాడార్ నుంచి కనిపించకుండా పోయింది. ఈ విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు వారిని కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. దీనికి ఆపరేషన్‌ హోప్‌ అని పేరు పెట్టి దట్టమైన అమెజాన్ అడవుల్లో గాలింపు చేపట్టారు. విమాన ప్రమాదం జరిగిన 15 రోజుల తరువాత మే 16న విమాన శకలాలను గుర్తించింది సైన్యం. ఆ ప్రాంతంలో పైలట్‌, చిన్నారులు తల్లి, గైడ్‌ మృతదేహాలను గుర్తించారు.

కానీ విమానంలో 4, 9, 14 ఏళ్ల చిన్నారులతో పాటు ఉన్న 11 నెలల పసిబిడ్డ మాత్రం కనిపించలేదు. అక్కడ వారు చనిపోతే కనీసం వారి డెడ్ బాడీస్ అయినా ఉండాలి కదా. లేక వాళ్లు చనిపోతే ఎవైనా జంతువులు తినేశాయా అన్న కోణంలో అధికారులు గాలింపు చేపట్టారు. సమారు 150 మంది సైనికులు, జాగీలాలతో అమెజాన్‌ అడవిలో తీవ్రంగా అణువనువు గాలించారు. వారి శ్రమకు ఫలితం దక్కింది. మే 18న అక్కడికి సమీపంలోనే చిన్నగుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్‌, పాలసీసా, సగం తిన్న పండు వంటివి సైన్యానికి కనిపించాయి. దీంతో పిల్లలు అడవిలోనే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు వారి కోసం అడవిని జల్లెడపట్టారు.

ఈ క్రమంలో విమాన ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత చిన్నారులను సజీవంగా గుర్తించారు (Children Found Alive in Forest). వారి వద్దకు సైత్నం చేరుకునే సమయానికి నలుగురు పిల్లలు ఒంటరిగానే ఉన్నారు. భయంకరమైన క్రూరమృగాలు తిరిగే అడవిలో ఇన్ని రోజులుగా ఆ చిన్నారులు తమను తాము ఎలా కాపాడుకున్నారన్నది అందరిని ఆశ్చర్యంలో ముంచుతోంది. ప్రస్తుతం పిల్లలకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ని రోజుల తర్వాత చిన్నారులు సజీవంగా కన్పించడంతో కొలంబియాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.


Comment As:

Comment (0)