fir Accident in Ship

నౌకలో భారీ అగ్నిప్రమాదం - కాలిపోయిన 3000 కార్లు

 ఇంటర్నేషనల్ డెస్క్- సుమారు 3 వేల కార్లతో వెళ్తున్న నెదర్లాండ్స్‌ కు చెందిన ఓ కార్గో నౌక (Cargo Ship) అగ్ని ప్రమాదానికి గురైంది. 3,000 కార్లతో అట్లాంటిక్‌ సముద్రంలోని నార్త్ సీలో వెళ్తున్న ఈ నౌకలో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. ప్రమాద తీవ్రత పెరగడంతో భయాందోళనకు గురైన సిబ్బంది తప్పించుకునేక్రమంలో కొందరు సముద్రంలో దూకినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది నౌకలోని వారిని బయటకు తీసుకువచ్చారు. ఐతే ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 

అసలేం జరిగిందంటే.. జర్మనీ (Germany) లోని బ్రెమెన్‌ పోర్టు (Bremen Port) నుంచి ఈజిప్టు (Egypt) లోని మరో పోర్టుకు ఫ్రెమాంటిల్‌ హైవే నౌక (Fremantle Highway Ship) మొత్తం 2857 కార్లతో బయలుదేరింది. అందులో కొన్ని ఎలక్ట్రిక్‌ కార్లు కూడా ఉన్నాయి. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌక అమేలాండ్‌ ద్వీపానికి (Ameland Island) 27 కిలో మీటర్ల దగ్గర్లో ఉండగా అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపించకపోవడంతో అందులో ఉన్న సిబ్బంది కొందరు సముద్రంలోకి దూకారు.

సమాచారం తెలుసుకున్న డచ్‌ కోస్ట్‌ గార్డ్‌ (Dutch Coast Guard) వెంటనే హెలికాప్టర్లు, బోట్ల సాయంతో  అక్కడకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించింది. నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా, 22 మందిని బయటకు తీసుకువచ్చారు. ఓ వ్యక్తి మాత్రం అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. నౌక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అందులోని కార్లన్నీ దగ్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని డచ్ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.


Comment As:

Comment (0)