News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రాజధాని కమిటీ పై మీ వైఖరేంటి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన హైకోర్టు
కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం
మంత్రులు బొత్స, బుగ్గనలకూ నోటీసులు జారీ
తదుపరి విచారణ 28కి వాయిదా
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రణాళికల పునస్సమీక్ష కోసం ఏర్పాటు చేసిన కమిటీపై వైఖరి తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ వాటికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు.

రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సిఫారసులు చేసేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ గతనెల 13న రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవో 585ను సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా బోరుపాలెంకు చెందిన రైతులు చనుమోలు శివలింగయ్య, రామారావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్‌ వాదనలు వినిపించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం రాజధాని ప్రాంతాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అన్నీ పరిశీలించాకే అమరావతిని రాజధానిగా నిర్ధారించింది. రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని ఆ చట్టంలో ఉంది. ఆ ప్రాంతంలో రాజ్‌భవన్‌, సచివాలయం, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తదితర నిర్మాణాలు జరగాల్సి ఉంది.

ఇందులో భాగంగా కేంద్రం రూ.1500కోట్లు కేటాయించింది. పనులు సాగుతున్న తరుణంలో కొత్తగా ఏర్పాటైన రాష్ట్రప్రభుత్వం నిర్మాణ పనుల్ని పట్టించుకోవడం లేదు. రాజధాని ప్రణాళికలను సమీక్షించేందుకంటూ కమిటీని ఏర్పాటు చేసింది. చట్టసభ ద్వారా ఏర్పాటైన సీఆర్‌డీఏపై పునఃసమీక్షించే అధికారం ఈ కమిటీకి లేదు. అసలా కమిటీని ఏర్పాటు చేసే అధికారమూ ప్రభుత్వానికీ లేదు. రాజధాని కోసం రైతుల నుంచి భూమి సేకరించేటప్పుడు మూడేళ్లలో అభివృద్ధి చేస్తామని, రైతులకు ప్రయోజనాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీనుంచి వారు వెనక్కి వెళ్లలేరు. అమరావతి ప్రణాళికలపై కమిటీ పునఃసమీక్షిస్తే ఆ ప్రభావం రాజధానిలోని 29 గ్రామాల ప్రజల హక్కులపై పడుతుంది. రాజధాని నిర్మాణం ఆలస్యమైతే భూములిచ్చిన రైతులతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు’ అని తెలిపారు.
బొత్స, బుగ్గన వ్యాఖ్యలతో : ‘ఆ కమిటీ రాజధానిలో మరిన్ని నిర్మాణాలకు, మరింత అభివృద్ధికి సిఫారసు చేయవచ్చేమో కదా’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ పలుమార్లు పొంతనలేని వివాదాస్పద ప్రకటనలు చేశారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ప్రభునాథ్‌ ఈ సందర్భంగా ఉటంకించారు. రాజధానికి ఈ ప్రాంతం సురక్షితం కాదని, నిపుణులు ఎక్కడంటే అక్కడే అని, రాజధాని అమరావతో, హైమవతో అని, అమరావతిలో రాజధానివల్ల ఒక ప్రాంతంవారికి, ఒకే సామాజిక వర్గంవారికి మాత్రమే లబ్ధి చేకూరుతోందని.. ఇలా మంత్రి రకరకాల వ్యాఖ్యలు చేశారన్నారు.

- Advertisement -

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సైతం హైకోర్టు తరలింపుపై వ్యాఖ్యానించారని.. ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు హైకోర్టు కోసం విధులు బహిష్కరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యాఖ్యలతో రాజధాని, హైకోర్టు తరలిపోతున్నాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని, సీఎం దీనిపై నోరు మెదపడం లేదని తెలిపారు. రాజధానికి సాక్షాత్తూ దేశ ప్రధాని శంకుస్థాపన చేయగా.. హైకోర్టును దేశ సర్వోన్నతన్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారని, కానీ ఈ రెండింటినీ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ30 వేల కోట్లు వ్యయం చేశారని, ఇప్పుడు రాజధానిని మరో ప్రాంతానికి తరలిస్తే అదంతా వృధా అవుతుందని తెలిపారు. రాజధానిలో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందువల్ల రాజధాని కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని, సీఆర్‌డీఏ ప్రణాళికల మేరకు చేపట్టిన అభివృద్ధి పనుల్ని యఽథాతథంగా కొనసాగించేలా సంబంధీకుల్ని ఆదేశించాలని అభ్యర్థించారు.

మీడియా కథనాలతోనే ఆందోళన : ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కేవలం మీడియాలో వచ్చిన కథనాలతో ఆందోళన చెందిన పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు తప్ప అంతకు మించి మరేమీ లేదని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలను విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై తగిన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్‌, మంత్రులు బొత్స, బుగ్గన, కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు, కమిటీ సభ్యులు తదితర ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేశారు. కోర్టు విచారణ ముగిసే వరకూ నిపుణుల కమిటీ రాజధాని నిర్మాణ ప్రణాళికలపై పునఃసమీక్ష జరపకుండా నిలువరిస్తూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని ప్రభునాథ్‌ అభ్యర్థించగా.. ‘మీ వాదనలతో కోర్టు ఏకీభవిస్తే కమిటీ ఏర్పాటునే తప్పు పడతాం కదా’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.