చంద్రబాబుపై పగతో తీశారా

news03 March 30, 2019, 4:02 p.m. entertainment

laxmis ntr

సినిమా- లక్ష్మీస్ ఎన్టీఆర్
నటీనటులు- విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, రాజశేఖర్ తదితరులు
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- రాంగోపాల్ వర్మ

పరిచయం.........
రాంగోపాల్ వర్మ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఆయన ప్రారంభంలో తీసిన రెండు మూడు సినిమాలు తప్ప.. మిగతావన్నీ సంచలనాలకోసమే తీశారని వేరే చెప్పక్కర్లేదు. మాఫియా నుంచి మొదలు ఫ్యాక్షనిజమ్, సినిమా పరిశ్రమలోని అంశాలపై వర్మ చాలా సినిమాలు తీశారు. అవన్నీ ఎవరొ ఒకరిని టార్గెట్ చేసి తీసినవేనని వర్మ సినిమాలు చూస్తే ఇట్టే అర్దమవుతుంది. వర్మ తీసిన చాలా వరకు సినిమాలు వాస్తవ కధల ఆధారంగా అని చెప్పినా.. సంచలనాల కోసం వాస్తవ కధలను పూర్తిగా వక్రీకరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన సినిమాలు చూస్తే తెలిసిపోతుంది. ఓకే మరి ఇప్పుడు వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నిజాలను చూపించాడా.. లేక ఎప్పటిలాగే వాస్తవాలను వక్రీకరించాడా అన్నది తెలియాలంటే సినిమా చడాల్సిందే.........

laxmis ntr

కధ....
సినిమా టైటిల్స్ ప్రారంభంతోనే ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబందించి ఫోటోలను చూపించారు. ఆయా ఘట్టాలకు సంబందించిన వివరాలను రాసి చూపించారు. సినిమాను ఎన్టీఆర్ మొదటి సారి సీఎం అయ్యాక.. రెండు సారి ఓడిపోయిన సమయం నుంచి మొదలుపెట్టారు. ఇక టైటిల్స్ అవ్వగానే ఓ ఆటో వెళ్లి ఎన్టీఆర్ ఇంటి ముందు ఆగుతుంది. అందులోంచి లక్ష్మీ పార్వతి దిగి ఎన్టీఆర్ ఇంట్లోకి వెళ్తుంది. ఎన్టీఆర్ ను కలిసి తన జీవితంపై పుస్తకం రాస్తానని కోరుతుంది. కాసేపు ఆలోచించాక ఎన్టీఆర్ తన జీవితంపై పుస్తకం రాయడానికి లక్ష్మీ పార్వతికి ఓకే చెబుతారు. ఈ క్రమంలో రెండు మూడు సార్లు కలిసి మాట్లాడాక లక్ష్మీ పార్వతిపై ఎన్టీఆర్ కు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నీ సమక్షంలో ఉంటే ఆందోళనలు, మనోవేధనలు దూరమై.. ఆనందం కలుగుతోందని ఓ సందర్బంలో లక్ష్మీ పార్వతికి చెబుతారు ఎన్టీఆర్. దీంతో వారిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇదే సమయంలో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కు దగ్గరవుతోందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. ఓ సారి వచ్చి లక్ష్మీ పార్వతి అంత మంచిది కాదని చెబుతారు కూడా. ఐతే ఎన్టీఆర్ వారి మాటలను మాత్రం నమ్మడు. అందరిని ఇంట్లోంచి వెళ్లిపొమ్మని కోప్పడతాడు. 

ఈ క్రమంలోనే మోహన్ బాబు ఎన్టీఆర్ తో తీసిని మేజర్ చంద్రకాంత్ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా విజయోత్సవ సభను తిరుపతిలో ఏర్పాటు చేస్తారు. ఐతే ఈ సభను టీడీపీ పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని చంద్రబాబు సహా, టీడీపీ నేతలు భావిస్తారు. ఐతే లక్ష్మీ పార్వతిని ఈ సభా వేధికపైకి తీసుకురావద్దని ఎన్టీఆర్ ను కుటుంబ సభ్యులు కోరతారు. అప్పటికి సరేనన్న ఎన్టీఆర్.. తీరా తిరుపతి విజయోత్సవ సభలో లక్ష్మీపార్వతిని వేధికపైకి పిలిచి.. తనని పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటిస్తాడు. ఇదంతా చంద్రబాబు సహా.. కుటుంబ సభ్యులెవ్వరికి నచ్చదు. ఇంటికి రాగానే సింపుల్ గా లక్ష్మీ పార్వతి మెల్లో తాళి కడతాడు ఎన్టీఆర్. ఇంతలోనే ఎన్నికలు రావడం.. అభ్యర్దులను తానే ఎంపిక చేస్తానని ఎన్టీఆర్ పార్టీ నేతలకు చెబుతారు. తీరా అభ్యర్ధులను ప్రకటించాక.. లక్ష్మీ పార్వతే ఎభ్యర్ధులను ఎంపిక చేశారని.. ఎన్టీఆర్ ఆమె చేతిలో కీలు బొమ్మ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 

laxmis ntr

చివరికి ఎన్నికల ప్రచారంలోను లక్ష్మీ పార్వతిని వెంటే తీసుకెళ్తారు ఎన్టీఆర్. ఎట్టకేలకు భారీ విజయంతో ఎన్టీఆర్ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారు. ఆ తరువాత జరిగే పరిణామాల్లో లక్ష్మీ పార్వతి ప్రభుత్వ కార్యకలాపాల్లో కల్పించుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అందుకోసం పార్టీని కాపాడుకోవడానికి ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి దింపాలని చంద్రబాబు సహా పార్టీ నేతలు నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేలందరిని కూడగట్టుకుని వైస్రాయ్ హోటల్ లో క్యాంపు పెడతారు. అక్కడికి లక్ష్మీ పార్వతిని తీసుకుని వెళ్లిన ఎన్టీఆర్ కు పరాభవం ఎదురవుతుంది. ఆ తరువాత గవర్నర్ ను కలిసి తనకు ఎమ్మెల్యేల మధ్దతు ఉందని చంద్రబాబు సీఎం అవుతారు. తనను అంతా కలిసి మోసం చేశారన్న బాధతో ఎన్టీఆర్ కన్ను మూస్తారు.

ఎలా ఉందంటే..........
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దృష్టిలె పెట్టుకుని రాంగోపాల్ వర్మ తీశారని చూసిన వారందరికి అర్దమవుతుంది. అదీ కాకుండా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు విడుదల చేశారంటే అది ఖచ్చితంగా వైఎస్ జగన్ కు మేలు చేసి.. టీడీపీ పార్టీకి నష్టం చేయాలన్న లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఎందుకంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మొత్తం చంద్రబాబును విలన్ గా చూపించారు. అదే సమయంలో లక్ష్మీ పార్వతిని దాదాపు దేవతగా చూపించారు. లక్ష్మీ పార్వతి కేవలం ఎన్టీఆర్ పై అభిమానంతో.. ఆయనకు సేవ చేసుకోవడానికి మాత్రమే వచ్చినట్లు.. ఆమెపై ఎన్టీఆర్ ప్రేమతో పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. అంతే కాదు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కు సేవ చేయడం.. వంట చేయడం వరకే పరిమితం అయినట్లు సినిమాలో చూపించారు. 

laxmis ntr

కానీ ఎన్నికల సమయంలో టిక్కెట్ల కెటాయింపుల్లో, మంత్రి పదవుల పంపకాల్లో, ప్రభుత్వ కార్యకలాపాల్లో, కాంట్రాక్టులు కెటాయించడంలో లక్ష్మీ పార్వతి ప్రమేయానికి సంబందించి మాత్రం ఒక్క చోట కూడా చూపించలేదు. అంతే కాదు అసలు ఎన్టీఆర్ ఆయన కుటుంబానికి దూరం కావడానికి అసలు కారణం లక్ష్మీ పార్వతేనని చెబుతారు. కానీ ఇందుకు సంబందించిన సన్నీవేశాలు సైతం లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏ మాత్రం చూపించలేదు. మొత్తానికి చెప్పాలంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీ పార్వతిని దేవతగా.. చంద్రబాబును విలన్ గా చూపించారు తప్పితే వాస్తవాలను ఏ మాత్రం చూపించలేదని చెప్పవచ్చు. అసలు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి.

ఎవరెలా చేశారంటే...
లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ లో నటించిన యజ్ఞ శెట్టి నటన బావుంది. ఆమె లక్ష్మీ పార్వతి పాత్రలో ఇమిడిపోయింది. ఇక ఎన్టీఆర్ పాత్రకు విజయ్ కుమార్ ఏ మాత్రం సరిపోలేదు. కాస్త ఎబ్బెట్టుగా కన్పించారు. ఇక ఆయనకు డబ్బింగ్ కూడా సరిపోలేదని చెప్పవచ్చు. చంద్రబాబు పాత్రకు మాత్రం రాజశేఖర్ కాస్త అటూ ఇటూగా సరిపోయారని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ, హరి కృష్ణ, పురంధీశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు తోపాటి మిగతా క్యారెక్టర్స్ ఎవ్వరికి షూట్ అవ్వలేదు. అన్ని క్యారెక్టర్స్ ఎబ్బెట్టుగా కన్పించాయి. 

చివరగా.....
రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కేవలం చంద్రబాబు నాయుడుపై పగతో.. వైఎస్ జగన్ పై ప్రేమతో తీశారని ఇట్టే అర్దమవుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో టీడీపీకి నష్టం చేసి.. వైసీపీకి లాభం చేయాలన్న తపన సినిమా చూస్తే తెలిసిపోతుంది. అదన్నమాట సంగతి.

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: laxmis ntr, laxmis ntr movie, laxmis ntr movie review, laxmis ntr film, laxmis ntr film review, laxmis ntr movie rating, laxmis ntr exclusive review, laxmis ntr rating

Related Post